Thursday, January 23, 2025

స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం

- Advertisement -
- Advertisement -

మనం చేసిన పనులే చరిత్రను సృష్టిస్తయి, చరిత్రను తిరగరాస్తయి. మనం చేసే మంచి పనులే మన భవితకు బాట చూపుతయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చరిత్రను సృష్టించే నిర్మాణాత్మక విధానాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ అవలంబిస్తున్నారు. ఆరోగ్య రంగంలో చివరి వరసలో ఉన్న తెలంగాణను స్వల్పవ్యవధిలోనే దేశంలో మూడో స్థానానికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థను పటిష్టం చేసి తెలంగాణను దేశానికి మోడల్‌గా నిలిపారు. రెండేండ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి చరిత్రను సృష్టించారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న ప్రజలను ‘నేను సర్కారు దవాఖానకే పోతా’ అనే దశకు తీసుకువచ్చారు.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న సూక్తి వ్యక్తులకే కాదు, రాష్ట్రానికి, దేశానికి కూడా వర్తిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉన్న రాజ్యం ఆర్థికంగా పటిష్టమై అభివృద్ధిలో దూసుకుపోతుంది. శ్రేయోరాజ్యంగా వర్ధిల్లుతుంది. ఇది నమ్మిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేశారు. వారి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేసి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందూ, తర్వాత రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని పరిశీలిస్తే.. ఆ రంగంలో జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో దవాఖానల అందుబాటులో లేక, ఉన్న దవాఖానల్లో వసతుల్లేక, తగిన సిబ్బంది లేక పేద ప్రజలు నానా అవస్థలుపడ్డారు. రోగ నిర్ధారణ పరీక్షలకు, చికిత్సకు, మందుల కోసం ప్రైవేటు దవాఖానల్లో లక్షల ధారపోసి అప్పుల పాలయ్యారు. రోగిని రక్షించుకోవాలో, చేసిన అప్పులు ఎట్లా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉమ్మడి రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఉద్యమ సమయంలో కండ్ల నిండా చూసిన ముఖ్యమంత్రి కెసిఆర్, అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నారు.
‘పడకేసిన పల్లె వైద్యం’, ‘మంచమెక్కిన మన్యం..’, ‘సీజనల్ వ్యాధులతో జనం విలవిల..’, ‘ఊరంతా కలరా..!’ ఇలాంటి ఎన్నో వార్తలు నాడు పత్రికల్లో, టివిల్లో చూసి విస్తుపోయాం. నేడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు. అలా లేకుండా చేయగలిగామంటే ముఖ్య కారణం ముఖ్యమంత్రి కెసిఆర్. ఆయన మార్గనిర్దేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కృషి ఎనలేనిది. యావత్ వైద్య సిబ్బంది చేస్తున్న కృషి వల్ల తెలంగాణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయాలని ప్రతిష్ఠాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యరంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. తత్ఫలితంగానే స్వరాష్ట్రంలో మొదలైన వైద్యారోగ్య విప్లవం సత్ఫలితాలు సాధిస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో పల్లె దవాఖానలు పరిఢవిల్లుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానలు గస్తీ కాస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నోస్టిక్స్ సెంటర్ల ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నది. కేవలం మూడే మూడున్న డయాలసిస్ సెంటర్లను 102కు పెంచింది. రోగం ముదిరితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, పెద్ద రోగాలు నయం జేసే జిల్లా ఆస్పత్రులు, వైద్యంతో పాటు, వైద్య విద్యను అందించే మెడికల్ కాలేజీలు.. ఇలా రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సౌకర్యాలు ఇప్పుడు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి.
పేషెంట్ కేర్ పెంచేందుకు నర్సింగ్ కాలేజీలు, చారిత్రక వరంగల్ పట్టణంలో హెల్త్ సిటీ నిర్మాణం, హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, నిమ్స్ విస్తరణ, మాతా, శిశు సంరక్షణ కోసం ఎంసిహెచ్‌లు, నవజాత శిశు రక్షణ కోసం ఎస్‌ఎన్‌సియులు, డిపిసియులు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఉచితంగా టిఫా స్కానింగ్ కేంద్రాలు, సులభతర ప్రసవాల కోసం మిడ్ వైఫరీ సిస్టం… ఇలా ఎన్నో రకాల మెరుగైన వసతులు రాష్ట్రంలో అమలవుతుండటం అభినందనీయం. తెలంగాణ ప్రభు త్వం వైద్యారోగ్య రంగాన్ని పటిష్ఠం చేసేందుకు అమలుచేస్తున్న పథకాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలు చెప్తే రామాయణం, వింటే మహా భారతం. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి కాలంజేసే దాన్క అన్ని దశల్లోనూ ప్రజలకు సేవ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నేడు సిద్ధంగా ఉన్నదని చెప్పేందుకు గర్వపడుతున్నాను. యావత్ ప్రపంచాన్ని గజగజా వణికించిన కరోనా మహమ్మారి మానవాళికి ఎన్నో గుణపాఠాలు నేర్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో జరిగిన అభివృద్ధి ప్రజలను పెను ప్రమాదం నుంచి తప్పించింది.
కరోనాను కట్టడి చేసి, చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడటంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. అయినా భవిష్యత్తు కరోనా వంటి విపత్తులు ఎన్ని వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఆ దిశగా ప్రజారోగ్య వ్యవస్థ మరింత పటిష్ఠం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు గాను 2021- 22తో పోల్చితే గతేడాది 76 శాతం నిధులు ఎక్కువగా అంటే, రూ.11,440 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించడం ముదావహం. ఈ ఏడాది కూడా వైద్యారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్‌లో రూ.12,364 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెలకు పెంచారు. అప్పటివరకు ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ హెల్త్ కేర్ మాత్రమే ఉండగా, కొత్తగా కింది స్థాయిలో ప్రివెంటెవ్ అండ్ ప్రమోటివ్ హెల్త్‌కేర్.. పైస్థాయిలో సూపర్ స్పెషాలిటీ సేవలందించే క్వాటర్నరీ హెల్త్‌కేర్ వ్యవస్థను అదనంగా జోడించారు.
వైద్య విద్య విప్లవానికి నాంది: ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో తెలంగాణలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు మూడంటే మూడే. అంటే సగటున ఇరువై ఏండ్లకొక ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షే అయ్యింది. మరోవైపు డాక్టర్ కావాలనుకున్న తెలంగాణ యువత కల కల్లలైంది. తెలంగాణ ప్రాంతం ఇలా రెండు విధాలుగా నష్టపోయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వరాష్ట్రంలో వైద్య విప్లవానికి నాంది పలికారు. గడిచిన ఎనిమిదేండ్లలో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు, వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దటీజ్ కెసిఆర్. జిల్లాకొక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు విధానాన్ని ప్రకటించడమే కాదు, ప్రారంభం చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు ఉండేలా చేసి, మెడికల్ సీట్లలో తెలంగాణను దేశంలోనే తొలి స్థానానికి తీసుకువచ్చారు. ఎంబిబిఎస్ ‘బి’- కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ తొలిసారిగా కల్పించి, స్వరాష్ట్రంలో ఉంటూనే వైద్య విద్యనభ్యసించే అవకాశాలను తెలంగాణ యువతకు కల్పించారు. దీంతో 8,78,280 నీట్ ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి ఎంబిబిఎస్ సీటు వచ్చింది. చైనా, ఉక్రెయిన్, రష్యా, వంటి దూర దేశాలకు వెళ్లి, పరిచయం లేని భాషలో ఆపసోపాలు పడుతూ ఎంబిబిఎస్ చదువాల్సిన గత్యంతరం ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు లేదే.
అగ్రస్థానంలో ఆరోగ్య తెలంగాణ: రాష్ట్ర వైద్య రంగాభివృద్ధికి నిలువుటద్దం కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు. నీతి ఆయోగ్ ర్యాంకుల ప్రకారం… ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నది. వయస్సులో, విస్తీర్ణంలో చిన్న రాష్ట్రం అయిన తెలంగాణ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి స్వల్ప సమయంలోనే అగ్రస్థానానికి చేరడమంటే ఆషామాషీ కాదు. దాని వెనుక ఎంతో కృషి, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే పట్టుదల ఉంటేనే అది సాధ్యమవుతుంది. అవన్నీ కెసిఆర్‌లో మెండుగా ఉన్నాయి. అందుకే ఆయన మూడో ర్యాంకులో ఉన్నామని సంతృప్తి చెందడం లేదు. మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకే ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలందించేలా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మా వైద్యారోగ్యశాఖ నిర్విరామంగా కృషి చేస్తున్నది. కనీస వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో నేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. చిన్న చిన్న జ్వరాలకే పిట్టల్లా రాలిపోయిన గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలకు నేడు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి.
2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ దవాఖాన ప్రసవాలు 66 శాతానికి పెరిగాయి. కడుపు కోతలు తగ్గి, సాధారణ డెలివరీలు రెట్టింపయ్యాయి. రోగానికి మందు వేయడమే కాదు, ముందుగా గుర్తించి సత్వర చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడీ కిట్లను కూడా పంపిణీ చేస్తున్నది. ప్రజల కష్టాలు తెలిసిన ఉద్యమ నాయకుడే పాలకుడు కావడం వల్లనే ఇదంతా సాధ్యమవుతుందన్నది అక్షర సత్యం. నేను మొదట చెప్పినట్టు.. మనం చేసిన పనులే చరిత్రను సృష్టిస్తయి, చరిత్రను తిరగరాస్తయి. మనం చేసే మంచి పనులే మన భవితకు బాట చూపుతయి. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గత తొమ్మిదేండ్లలో తెలంగాణ వైద్యరంగాన్ని దేశానికి మోడల్‌గా నిలిపాం. ఇదే స్ఫూర్తి తో ప్రపంచ స్థాయికి తెలంగాణ ఆరోగ్యరంగాన్ని తీసుకువెళ్లేందుకు వైద్యారోగ్యశాఖ నిరంతరం కృషి చేస్తుందని సగర్వంగా ప్రకటిస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News