Wednesday, January 22, 2025

హిందీలో వైద్య విద్య!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: మార్పు మంచిదీ కావచ్చు, చెడుదీ కావచ్చు. త్వరగా సాగుతున్న మానవ జీవన గమనంలో అటువంటి మార్పులు తరచూ వస్తుంటాయి. వాటి మంచి, చెడ్డలు అనుభవంలోగాని రుజువు కావు. ఆలోగా వాటికి బలైపోయే జనం వేదన వర్ణించనలవికానిది. పాఠశాలల్లో, కళాశాలల్లో చదువును మాతృభాషల్లోనే బోధించాలి అనే ఆలోచన రోజురోజుకీ బలం పుంజుకుంటున్నది. అన్యభాషల్లో ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అనుసంధాన భాషగా వున్న ఆంగ్లం లో నేర్చుకోడం మానేసి స్వభాషా పరిమళాలు వెదజల్లాలని చాలా మంది చెపుతుంటారు.

ఈ ఆలోచన పాలకుల మెదళ్లలో కలిగితే అది ఆచరణలోకి రాడానికి ఎంతో సమయం పట్టదు. ఆంగ్ల (ఆల్లోపతి) వైద్య విద్యను హిందీలో బోధించే అధ్యాయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల మధ్యప్రదేశ్‌లో తెర లేపారు. ముందుగా ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీలను హిందీలో బోధించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉన్న చోట ఉపాధి, ఉద్యోగం కరవైతే అవి లభించే చోటికి వెళ్లి స్థిరపడడం మొట్టమొదటి నుంచి మానవ సమూహాల లక్షణంగా స్థిరపడిపోయింది. అందుకే గ్రామాలు ఖాళీ అయి పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇలా పొట్టచేతపట్టుకొని వెళ్లే క్రమంలో ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాలకు కూడా వెళ్లవలసి వస్తుంది.

అక్కడి భాష తెలియని వారు సహజంగానే ఉపాధి వేటలో దెబ్బతింటారు. అందుచేత వీలైనన్ని ఇతర భాషలు నేర్చుకోడం అత్యవసరమైనదిగా మారుతుంది. ఇటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇంగ్లీషులోనే వుండే వైద్య విద్యను హిందీలో నేర్పుతాం అని అమిత్ షా గారు దండోరా వేసి దానిని ప్రారంభిస్తే అది హిందీ ప్రాంత విద్యార్థులకు ఎలా మేలు చేస్తుంది అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ హిందీ పాఠ్యగ్రంథాల్లో కూడా అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ అనే పదాలను వున్నదున్నట్టు హిందీలో రాశారని తెలుస్తున్నది. ఏ భాషలో అయినా ప్రజలకు అరటి పండు వొలిచి పెట్టినట్లు అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడే అది రాణిస్తుంది. ఆంగ్లంలోని వైద్య గ్రంథాలను పండిత భాషలో అనువదిస్తే ఆ ప్రయోగం విఫలం కాక తప్పదు. ఆంగ్లంలో స్థిరపడిన పదాలకు సమానమైన పద సంపద మన భాషల్లో వుండదు.

పూర్వం ఒక పండితుడి ఇంటికి ఒక బిచ్చగాడు వెళ్లి ‘అమ్మా, ఆకలి’ అని అరవగా ఆయన భార్య తనకొచ్చిన గ్రాంధికాంధ్రంలో ‘తండులంబు (బియ్యం) లు నిండుకొనియె’ అని జవాబు చెప్పిందట. ఆ బిచ్చగాడు జుట్టుపీక్కొని దండం పెట్టి వెళ్లిపోయాడట. తెలుగు మాధ్యమంలో చదువుకొన్న పట్టభద్రులు బయట ఉద్యోగాలు దొరక్క, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పోటీ పడలేక అభాసు పాలైన ఉదంతాలు మనకెన్నో కనిపిస్తాయి. ప్రాంతీయ భాషలో ఉన్నత చదువులు చెప్పొద్దు, చదవొద్దు అని ఎవరూ అనరు. అది ఎంత వరకు ఉపయోగపడుతుందో అనే గీటురాయి మీద బలంగా నిలబడాలి. తెలుగు మాధ్యమంలోని సైన్స్ పుస్తకాల్లో వెన్నెముక గల, లేని జంతువుల (vertebratenon vertebrate) కు కశేరుకాలు, అకశేరుకాలు అని అనువాదం చేశారు. అది ఎవరికి అర్థం కావాలి? అలాగే రిక్తిక, శక్తాగారాలు, ద్విదళ, ఏకదళ బీజ వృక్షాలు, కణత్వచము వంటి పదాలు నేర్చుకొని తెలుగు మాధ్యమ విద్యార్థులు ఏ రకంగా ఉద్యోగాలు సంపాదిస్తారు? సంస్కృతాంధ్రం మీద మోజుతో కొన్ని పత్రికలు ఇప్పటికే బాహ్య వలయ రహదారి, చరవాణి, అంతర్జాలం వంటి పదాలను వాడుకలోకి తేవడానికి విఫల ప్రయోగాలు చేస్తున్నాయి.

ప్రజలకు అర్థం కాని రీతిలో మాతృభాషల్లోకి పాఠ్యగ్రంథాలను అనువదించడం వారికి హాని చేయడమే అవుతుంది. ఆంగ్ల వైద్య శాస్త్ర పుస్తకాలను హిందీలోకి అనువదించడం రాజకీయ పన్నాగమేనని ఆ ప్రాంత మేధావులు కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. వైద్యం నిరంతరం జరిగే పరిశోధనల మీద ఆధారపడే శాస్త్రమని, వైద్య విద్యార్థి ఆధునిక పరిశోధనల ఫలితాలను కూడా ఆకళింపు చేసుకోవాలని, అయితే ఈ పరిశోధన గ్రంథాలు ఆంగ్లంలోనే వుంటాయని, హిందీలో వైద్య విద్య నేర్చుకొనే వారు ఈ గ్రంథాలను చదివి అందులో ఆరితేరిన వారు కాలేరని ఒక హిందీ ప్రాంత నిపుణుడు అన్నారు. చైనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల్లో ప్రాంతీయ భాషల్లో వైద్య విద్య నేర్పుతున్నప్పటికీ అక్కడ తయారయ్యే పట్టభద్రులకు ఇండియా వంటి దేశాల్లో గిరాకీ బొత్తిగా వుండదని అనుభవంలో తెలుస్తున్నదే. ఇటీవల యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చేసిన వైద్య విద్యార్థులకు ఇక్కడి కళాశాలల్లో సీట్లు లభించక ఎన్నో కష్టాలెదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుచేత హిందీ ప్రాంతీయులను మెప్పించడానికి, ఎన్నికల్లో వారి ఓట్లు కొల్లగొట్టడానికి తొందరపడి ఇటువంటి చర్యలకు పాల్పడడం మేలు చేయదు.మన దేశ భాషా వైవిధ్యం అంతా ఇంతా కాదు. హిందీతో పాటు అనేక భాషలు వర్థిల్లుతున్న చోట అందరి నాలుకలపై హిందీని రుద్దాలనుకోడం అధికార దర్పంతో కూడిందే తప్ప మరొకటి కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News