Friday, December 27, 2024

మంకీపాక్స్‌పై భయాందోళనలు అక్కరలేదు

- Advertisement -
- Advertisement -

Medical Experts say no need to panic as monkeypox

ఇది తక్కువ అంటువ్యాధి, అరుదైన ప్రాణాంతకం : వైద్య నిపుణుల సూచన

న్యూఢిల్లీ : మంకీపాక్స్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినా, దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు బయటపడినా, ఈ వ్యాధిపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్య నిపుణులు ఆదివారం స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది అతి తక్కువ అంటు వ్యాధి అని, ప్రాణాంతక సంఘటనలు అరుదుగా ఉంటాయని వారు వివరించారు. గట్టి పర్యవేక్షణతో సమర్థంగా దీని వ్యాప్తిని నిరోధించవచ్చు. నిర్ధారించిన కేసులను ఐసొలేషన్ ద్వారా , అలాగే సన్నిహితులకు సోకకుండా కట్టడి చేయడం వల్ల దీని వ్యాప్తిని అరికట్టవచ్చునని వారు సూచించారు. అయితే రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. మంకీపాక్స్ వైరస్ సెంట్రల్ ఆఫ్రికన్ ( కాంగో ఆధారిత), వశ్చిమ ఆఫ్రికా కు చెందిన రెండు వైవిధ్య జన్యుపర సమూహాలతో కూడుకున్నదని పుణె నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( ఎన్‌ఐవి) సీనియర్ సైంటిస్టు డాక్టర్ ప్రగ్యాయాదవ్ వివరించారు.

పశ్చిమాఫ్రికాకు చెందిన జన్యుపర సమూహంతో కూడిన మంకీపాక్స్ వైరస్ ఇటీవల అనేక దేశాల్లో విస్తరించిందని, అయితే కాంగో తెగ వైరస్ కన్నా ఇది తక్కువ తీవ్రత గలిగినదని పేర్కొన్నారు. భారత్ లో నమోదైన కేసులు కూడా పశ్చిమాఫ్రికా తెగ వైరస్‌కు చెందినవేనని తెలిపారు. ఎపిడెమియోలజిస్టు , అంటువ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ చంద్రకాంత్ లహారియా మంకీపాక్స్ వైరస్ కొత్తదేమీ కాదన్నారు. ఐదు దశాబ్దాలుగా దీని ఉనికి ఉంటోందని, ఈ వైరస్ స్వరూపం, వ్యాప్తి, వ్యాధికారత పై సహేతుకమైన అవగాహన ఉందని తెలిపారు.

ఐసొలేషన్ , క్వారంటైన్ ద్వారా దీన్ని సమర్ధంగా నివారించవచ్చన్న నమ్మకం ఉందని లహారియా పేర్కొన్నారు. రింగ్ వ్యాక్సినేషన్ కోసం స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్లను సాధారణంగా ప్రజానీకానికి అధికారికంగా వినియోగించిన రీతిలో ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లను మంకీపాక్స్‌కు సిఫార్సు చేయడం లేదని లహారియా వివరించారు. ప్రస్తుతం 75 దేశాల్లో 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. కొవిడ్ వర్కింగ్ గ్రూపు ( ఎన్‌టిఎజిఐ) చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా కూడా మంకీపాక్స్‌పై అనవసరమైన భయాందోళనలు చెందరాదని సూచించారు. కొవిడ్ 19 నుంచి అలవడిన అనుభవాల ఆధారంగా దేశం లోని మంకీపాక్స్ కేసులను గట్టి పర్యవేక్షణతో గుర్తించి కట్టడి చేస్తున్నట్టు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News