Thursday, January 23, 2025

వర్షాల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
ప్రధాన ఆసుపత్రుల వైద్య సిబ్బంది సిద్దంగా ఉండి, సేవలందించాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర సేవలకు హెలికాప్టర్ వినియోగించాలి
రాష్ట్ర స్థాయిలో 24 గంటల పాటు స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
వైద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

హైదరాబాద్:  రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సబ్ సెంటర్ స్థాయి నుండి హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండి, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. గురువారం వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవలసిన చర్యలపై అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే విషయంలో అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో 24గంటల పాటు స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. 108, 102 వాహన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించాలని చెప్పారు. గర్బిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి వాహన సేవలు వినియోగించాలన్నారు. కెసిఆర్ కిట్ డేటా ఆధారంగా గర్భిణుల డెలివరీ డేట్ ముందుగా తెలుసుకొని, వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.గర్భిణులు, డయాలసిస్ పేషెంట్లకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. కలుషిత ఆహార పదార్థాలు తీసుకొని ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఆహార నాణ్యత పై దృష్టి సారించాలి. విద్యార్థుల వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో ఆయా పరిధిలోని ఏఎన్‌ఎం, వైద్యాధికారులు వెళ్లి సందర్శించాలి. ప్రాథమిక దశలోనే గుర్తించి, పరీక్షలు నిర్వహించి వైద్యం అందించి పరిశుభ్రత పట్ల అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.

ఆసుపత్రులు, వార్డులు, పరిసర ప్రాంతాల్లో శుభ్రత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ లదే అన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడి మంచి వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా, ఏరియా, సీహెచ్సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పీహెచ్సీ స్థాయిలో పాము కాటు, తేలు కాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మందుల స్టోర్లలో అవసరమైనన్ని మందులు ఉన్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేవు అనే మాట రావొద్దన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాతావరణ శాఖ అందించే సూచనలు పాటిస్తూ, ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు పూర్తి సిద్ధంగా ఉండాలన్నారు.

పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సత్వరం అందేలా చూడాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత జిల్లాల పరిధి వైద్యాధికారుతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల అరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేయాలని, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి, తక్షణ వైద్య సేవలు అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఇ రమేష్ రెడ్డి, డి హెచ్ శ్రీనివాస్ రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ హరిచందన సహా, అన్ని జిల్లాల ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News