Saturday, November 23, 2024

మెడికల్ స్టూడెంట్‌కు కాషాయ పాఠాలు

- Advertisement -
- Advertisement -

Medical students in Madhya Pradesh to now study about RSS founder

బిజెపి రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో కొత్తసిలబస్

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఇకపై వైద్య విద్యార్థులు హిందూత్వ దిగ్గజాల గురించి, ఆర్‌ఎస్‌ఎస్, భారతీయ జనసంఘ్ అధినేతల గురించి పాఠాలు వినాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశాలలో మౌలిక మార్పులు ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ ఆదివారం ఇక్కడ తెలిపారు. వైద్య విద్యార్థులు ఇకపై తొలి ఏడాది తమ వైద్య విద్యతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు కెబి హేడ్గేవార్, భారతీయ జనసంఘ్ నేత దీనదయాళ్ ఉపాధ్యాయ,స్వామి వివేకానంద, బి ఆర్ అంబేద్కర్‌ల బోధనలు వారి జీవిత విశేషాలను బోధిస్తారని సారంగ్ తెలిపారు. విద్యార్థులు ఏ కోర్సుల్లో ఉన్నా వారిలో సామాజిక విలువలు ఉండాలి. అదే విధంగా వారు వైద్యపరమైన నీతిని పాటించాలని, దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ సిలబస్‌లో అనుబంధ విశేషాంశాలను చేర్చుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు విధిగా మహార్షి చరకుడి గురించి తెలుసుకోవల్సి ఉంటుంది.

శశృతుడి గురించి కూడా పాఠాలు ఉంటాయి. రాష్ట్రంలో ఎంబిబిఎస్ విద్యార్థుల తదుపరి విద్యా సంవత్సరం ఈ ఏడాది చివరిలో ఆరంభం అవుతుంది. అప్పటిలోగా సరికొత్త పాఠ్యాంశాలను చేర్చడం జరుగుతుంది. జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసి) ఇటీవలే పేర్కొన్న అంశాలను తాము పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం కోర్సులలో భాగంగా నైతిక విలువల పాఠాలు ఉండాల్సిందేనని మండలి తెలిపిందని, ఇందుకు అనుగుణంగానే ఈ మహానుభావుల వ్యక్తిత్వాలను సిలబస్‌లో పాఠ్యాంశాలుగా చేర్చాలని తాము ఉద్ధేశించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి పేర్కొన్న దిగ్గజాలలో హెడ్గేవార్, ఉపాధ్యాయ, వివేకానంద హిందూత్వ మూలాలతో ఉన్న సంఘ్‌పరివార్ ప్రముఖులుగా ఉన్నారు. వీరిలో ప్రత్యేకించి మొదటి ఇద్దరు ఇప్పటి అధికార బిజెపికి మార్గదర్శకపు ఆర్‌ఎస్‌ఎస్ భారతీయ జనసంఘ్‌లో కీలక వ్యక్తులుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ హయాంలో ఆర్‌ఎస్‌ఎస్ దిగ్గజ పూర్వీకుల చరిత్ర పాఠాలకు రంగం సిద్ధం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News