ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించిన వైద్య వర్సిటీలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఊరట లభించనున్నది. ఉక్రెయిన్‌లోని అనేక వైద్య విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాయి. దీంతో యుద్ధ కల్లోలిత ఉక్రెయిన్ నుంచి పారిపోయి భారత్‌కు చేరుకున్న వైద్య విద్యార్థులకు తమ భవిష్యత్తుపై కొంత మేరకు భరోసా లభించినట్లయింది. అయితే..ప్రాక్టికల్ క్లాసులకు హాజరుకాలేమోనని కొందరు విద్యార్థులు కలత చెందుతున్నారు. రష్యా సైనిక దళాలు నిరవధికంగా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం ఆసాధ్యంగా మారడంతో ఉక్రెయిన్‌లోని అనేక వైద్య విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నవి సోమవారం నుంచి తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి.
ఇతర వైద్య విశ్యవిద్యాలయాలు కూడా అతి త్వరలోనే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిచాలని యోచిస్తున్నట్లు భారతీయ విద్యార్థులు తెలిపారు. డానిలో హాలిట్‌స్కీ ఎల్‌అవివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఇవానో ఫ్రాన్‌కివస్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, విన్నీట్సియా నేషనల్ పిరోగోవ్ మెడికల్ యూనివర్సిటీ, బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ సోమవారం నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి. సురక్షిత ప్రదేశాల నుంచి తమ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని భారతీయ విద్యార్థులు తెలిపారు. తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన పరిస్థితులలో ఆన్‌లైన్ తరగతులు పునరుద్ధరించడంతో మళ్లీ ఊపిరిపీల్చుకున్నట్లుగా ఉందని డానిలో హాలిట్‌స్కీ ఎల్‌అవివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి కనిష్క్ తెలిపారు. మార్చి 14 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు యూనివర్సిటీ డీన్ ఆఫీసు నుంచి నోటీసు వచ్చిందని కనిష్క్ తెలిపారు.