Saturday, November 16, 2024

మనిషి మలంలో ఔషధ గుణం

- Advertisement -
- Advertisement -

మనిషి అత్యంతంగా అసహ్యించుకునేది తన శరీరం విసర్జించే మలాన్నే. అది కంటబడ్డా, ముక్కుకు దాని వాసన తగిలినా ఛీ అంటూ దూరమెళ్లిపోతాడు. ఇంత నీచంగా చూసే మలం మరో మనిషికి ఔషధంలా పని కొస్తుందంటే నమ్మగలమా! నిజమే.. ఆరోగ్యవంతుడి మలం ఔషధమే. ఎన్ని మందులు వాడినా లొంగని కడుపు నొప్పి కష్టాలు మలం మార్పిడి ద్వారా దారి కొస్తాయని వైద్య పరిశోధనలు నిరూపించాయి. జీర్ణ వ్యవస్థలో మంట, పేగుల పొరల మధ్య ఏర్పడ్డ పుండ్లతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి మల మార్పిడి తగిన చికిత్స అని తేలింది. ఆరోగ్యవంతుడి మలాన్ని బాధితుడి పేగుల్లోకి చేర్చడం ద్వారా దానిలోని మంచి బాక్టీరియా రోగ కారకాలను అంతం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. మలమార్పిడి ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానాల్లో ఒకటి. శరీరంలోని అవయవాల మార్పిడి మాదిరే మలమార్పిడి కూడా వైద్యంలో భాగమైంది.

అల్సరేటివ్ కొలైటిస్ అనే ప్రేగు వ్యాధి జీర్ణ వ్యవస్థను పీడించే రుగ్మతల్లో ఒకటి. దీని వల్ల ఎప్పుడూ పొత్తి కడుపులో నొప్పి, తల తిరగడం, బరువు తగ్గడం జరుగుతుంటాయి. దాని ప్రభావం తీవ్రమైనప్పుడు రోగులు డయేరియా, రక్త విరేచనాల బారిన పడతారు. కడుపులో మంట వల్ల అన్నం సహించక, తిన్నా అరగక బలహీనపడడంతో మరిన్ని ఆరోగ్యసమస్యలు చుట్టుకుంటాయి. తింటుండగానే మధ్యలో దొడ్డికి రావడం, మసాలా పడితేనే విరేచనాలవడం దీని లక్షణం. బాధితులు బంధువులింటికెళ్లినా, ఫంక్షన్స్‌కి వెళ్లినా భయంతో ఏమీ తినలేక, ఎవరికీ చెప్పలేక ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి సమస్యలకు మల మార్పిడియే శరణ్యం అని ఈ చికిత్స చెబుతోంది. ఆరోగ్యవంతులైన కుటుంబ సభ్యుల లేదా ఇతరుల మలం సేకరించి పరీక్షించి రోగి పేగుల్లోకి ఎక్కించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

ఏడేళ్లుగా స్టిరాయిడ్స్‌తో అదుపులో పెడుతున్న తన అల్సరేటివ్ కొలైటిస్ బాధ మలమార్పిడి ద్వారా పూర్తిగా నయమైందని 1989లో అమెరికాకు చెందిన డా. బెన్నెట్ ప్రకటించి ఆ వైపు వైద్యశాస్త్రం దృష్టిని మరల్చారు. 2003లో ఆస్ట్రేలియాలో అయిదేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆరుగురు పేషేంట్లను నాలుగు నెలల వ్యవధిలో ఐదు వారాలు మలమార్పిడి చేసి మందులు వాడే అవసరాన్ని దూరం చేశారు. ఎన్ని మందులు వాడినా మళ్ళీమళ్ళీ పుట్టుకొచ్చే పేగు పుళ్లకు మలమార్పిడి తగిన చికిత్స అని 2013లో అమెరికాలోని ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. నవంబర్ 2014లో ఢిల్లీలోని మణిపాల్ హాస్పిటల్ లో డా. అవినాష్ సేథ్ ఆధ్వర్యంలో మన దేశంలో తొలిసారిగా ఈ చికిత్స జరిగింది. ఇప్పుడు విదేశీయులు కూడా అక్కడ వైద్యానికి వస్తున్నారని ఇండియన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిలో డా. అవినాష్ రాశారు. 2019లో కేరళలోని ఎర్నాకులం మెడికల్ సెంటర్ హాస్పిటల్‌లో పది మంది రోగులకు ఈ మార్పిడి చేసి వారిని బాధల నుంచి విముక్తులను చేశామని డా. మాత్యు ఫిలిప్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కొచ్చిలో ఈ చికిత్స కోసం ఓ ప్రత్యేక వైద్యశాల ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

2021లో పునేలో మొదటిసారిగా దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో డా. పరీక్షిత్ ప్రయాగ్ నేతృత్వంలో ఒక మహిళకు ఈ చికిత్స జరిగి సత్ఫలితాలను ఇచ్చింది. కడుపు నొప్పి తగ్గాలని మితిమీరిన యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల పేగుల్లోని మంచి బాక్టీరియా పూర్తిగా ధ్వంసమై కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకే దీనికి మల మార్పిడియే సురక్షిత పరిష్కారమని డా. ప్రయాగ్ అన్నారు. జనవరి 2022లో రక్త విరేచనాలతో బాధపడుతున్న 78 ఏళ్ల వృద్ధుడిని ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖానలో మలమార్పిడి జరిగి, ఆ వృద్ధుడి శేష జీవితానికి సుఖశాంతులను అందించింది. సేకరించిన మలాన్ని శుద్ధిచేసి మలద్వారం ద్వారా పెద్ద పేగులోకి, ముక్కులో పైపు ద్వారా చిన్న ప్రేగులోకి పంపామని, ఈ విధానం ద్వారా ప్రేగులు కోల్పోయిన రోగ నిరోధక శక్తిని పునరుద్ధరింపజేయవచ్చని ఆ చికిత్స చేసిన డా. పీయూష్ రాజన్ తెలిపారు. ఈ మధ్య క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, లూథియానాలో కూడా ఈ చికిత్స మొదలైనట్లు లివర్ అండ్ బైలరీ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.

ఈ ప్రక్రియ కోసం మల దాతను ఎంచుకునే ముందు ఆయనకు ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయనకు ఎలాంటి అంటురోగాలు లేవని నిర్ధారణకు రావాలి. ఎంపికైన వారితో చికిత్సకు ఒక రోజు ముందుగా మలం సేకరించమని చెబుతారు. మలం మెత్తబడేలా దాత లాక్సేటివ్స్ వాడాలి. ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిచిన మలాన్ని ఇంటి నుండే పంపించవచ్చు. మలంలోని మంచి బాక్టీరియా ఎనిమిది గంటల పాటు బతుకుతుందట. హాస్పిటల్ చేరిన మలాన్ని స్లైన్, డిస్టిల్ నీటితో శుభ్రం చేసి, అనవసరాలను తొలగించి సిరంజీల ద్వారా మలద్వారం నుండి రోగి ప్రేవుల్లోకి పంపిస్తారు. ఒక్కో సిట్టింగ్‌కు రూ. 25 వేలు ఖర్చయ్యే ఈ చికిత్స ద్వారా మూడు, నాలుగు సార్లు మార్పిడితో రెండు నెలలలో రోగి ఆరోగ్యం చక్కబడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

అవసరానికి రక్తాన్ని అమ్మినట్లే తమ మలాన్ని అమ్ముకొనే ఆరోగ్యవంతులు బయటి దేశాల్లో ఇప్పటికే తయారయ్యారు. ఆరోగ్యవంతుడి మలానికి విదేశాల్లో మంచి డిమాండు ఉంది. మేలురకం మలానికి తగిన డబ్బు చెల్లిస్తామని హాస్పిటళ్లు ప్రకటనలు ఇస్తుంటాయి. రక్తదానం లాగే మలదానం ఉదారంగా చేసేవారు కూడా ఉన్నారు. బ్లడ్ బ్యాంకుల్లాగే స్టూల్ బ్యాంక్‌ల ఏర్పాటు కూడా జరుగుతోంది. ఒక స్టూల్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి రూ. 15 కోట్ల దాకా ఖర్చవుతుందని, నెల నెల నిర్వహణకు రూ. పది లక్షలు అవసరమవుతాయని తెలుస్తోంది. మన దేశంలో కొన్ని మహా నగరాల్లోనే ఈ చికిత్స అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లోని కొన్ని హాస్పిటళ్లు ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. వ్యర్థాలుగా విసర్జింపబడుతున్న మలంలో మనిషికి మంచి చేసే లక్షణం ఉందని కనుగొన్న పరిశోధకులకు చేతులెత్తి మొక్కాల్సిందే!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News