మనతెలంగాణ/హైదరాబాద్ :అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పటంలో తడబాటు.. సాంకేతికంగా రి కార్డుల్లో ఉన్న వాటికి నిర్మాణాలలో ఉన్న వాటికి మధ్య తేడాలెందుకు లాంటి ములుకుల్లాంటి ప్రశ్నలకు తత్తరపాటు ..పొంతనలేని వివరణలు ..కప్పదాటు దాట వేత ధోరణులు ..ఇదీ శనివారం జలసౌధలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నిర్వహించిన సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారుల తీరుపట్ల అయ్యర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకబిగిన ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిపుణుల కమిటీ లేవనెత్తిన సందేహాలకు సంబంధించి అసలు నిజాలు పెదవి దాటి బయటకు రాలేదు. ప్రశ్నలు ఏకోణం నుంచి అడిగినా సరైన రీతిలో సమాధానాలు రా కపోవటంతో ఒక దశలో నిపుణుల కమిటీలోని సభ్యులు జుట్టు పీక్కొవాల్సి వచ్చింది.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజిల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మే రకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ని యమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా నియమితులైన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల బృందం రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించింది.
బ్యారేజిల కుంగుబాటుకు గల కారణాలు,వాటిలో లోపాలు సరిదిద్ది తిరిగి పునరుద్దరించుకునేందుకు గల అవకాశాలు తదితర అంశాలపై క్షేత్ర స్థాయి అధ్యయనాలను పూర్తి చేసుకుని శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో మలివిడత సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారులతోపాటు ,విశ్రాంత అధికారులు కూడా హాజరయ్యారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక , డిజైన్లు , నిర్మాణ పనులు పర్యవేక్షణ , నాణ్యత పరీక్షల పరిశీలన ,బ్యారేజిల నిర్వహణ తదితర అంశాల్లో కీలకంగా ఉంటూ వచ్చిన ఇద్దరు ఉన్నత స్థాయి విశ్రాంత అధికారులు మాత్రం నిపుణుల కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలు కుంగిపోయి , బుంగలు పడిన ఘటనల్లో కూడా ఇఎన్‌సిలుగా పనిచేసిన ఈ ఇద్దరు విశ్రాంత అధికారుల్లో ఒక అధికారి తాను అనారోగ్య కారణవల్ల అస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపి నిపుణుల కమిటీ సమావేశానికి రాలేదని సమాచారం.ఇఎన్‌సి స్థాయిలో ఏళ్ల తరబడి పనిచేసిన మరో విశ్రాంత అధికారి కూడా సమావేశానికి హాజరు కాలేదు. వీరిద్దరు ప్రభుత్వ సర్వీసులో ఉండగానే మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటులో బాద్యులుగా చేసి ఒకరిని ప్రభుత్వమే విధుల నుంచి తొలగించగా, మరో అధికారిని రాజీనామా చేయించి ఇంటికి పంపింది. ఇక 2016 నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎంపిక చేసిన అధికారులను ,
ఇందులో రిటైర్ట్ అయిన విశ్రాంత అధికారులను కూడా ప్రభుత్వం నిపుణుల కమిటీ సమావేశానికి పిలిపించింది. జలసౌధలో ఉదయం నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఇఎన్‌సిలు నాగేంద్ర రావు , అనిల్ కుమార్‌ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిపుణుల బృందంలోని సభ్యులు ములుకుల్లాంటి ప్రశ్నలు సంధించారు. పిన్‌పాయింట్ ప్రశ్నలు సంధించినప్పటీకి అవసరమైన సమాధానలు మాత్రం పూర్తి స్థాయిలో రాబట్టుకోలేకపోయారు. కొందరు అధికారులు డొంక తిరుగుడు సమాధానాలతో దాటవేత యత్నం చేసినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు అధికారులు బ్యారేజి నిర్మాణ పనులతో తమకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం .నీటిపారుదల శాఖలో ప్రస్తుతం ఉన్న ఇఎన్‌సిలు మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన తరువాత కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టిన వారు కావటంతో నిపుణుల కమిటి సమావేశంలో కేవలం ప్రేక్షకపాత్రకు పరిమితం అయినట్టు తెలుస్తోంది.
సహకారం అందని సమావేశం !
జలసౌధలో నిర్వహించిన డ్యామ్‌సేఫ్టి నిపుణుల కమిటీ నిర్వహించిన కీలక సమావేశం నీటిపారుదల శాఖలోని అధికారుల నుంచి సహకారంలేని సమావేశంగా అసంపూర్ణంగా ముగిసిపోయింది. గోదావరి నదిపైన మేడిగడ్డ ,అన్నారం , సుందిళ్ల బ్యారేజిల నిర్మాణం కోసం డిజైన్ల రూపకల్పన,నదిలో నిర్మాణ స్థలాల ఎంపిక, ఇన్విస్టిగేషన్ , హైడ్రాలజి , నమూనాల అధ్యయనం, ,డిజైన్ల రూపకల్పన, నిర్మాణ పనులు పర్యవేక్షణ , నాణ్యత పర్యవేక్షణ , బ్యారేజిల నిర్మాణం పూర్తయ్యాక వాటి ఆపరేషన్ , మెయింటినెన్స్ తదితర విభాగాలకు సంభధించిన పనుల్లో పాల్గొన ఎంపిక చేసిన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బ్యారేజిలను నిర్మించిన ఎల్‌అండ్‌టి కంపెనీతోపాటు ఇతర కంపెనీల ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కీలక సమావేశంలో సీడివో విభాగం అధికారులనుంచి వివరాల సేకరణ అంసపూర్తిగానే జరిగింది. అపరేషన్ అండ్ మెయింటినెన్స్‌కు సంబంధించిన అధికారలతో వివరాల సేకరణ జరపలేకపోయారు. సమావేశం ముగిశాక అందుల్లో పాల్గొన్న వివిధ విభాగాలకు చెందిన వారు జలసౌధ సింహద్వారం ఎదుట అప్పటికే సమావేశ సమాచారం కాసుకుని ఉన్న మీడియాకు జడిసి వెనుకద్వారం మీదుగా నిష్క్రమించారు. నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తోపాటు మిగిలిన సభ్యులు కూడా మీడియాతో మాట్లాడకూండా మౌనంగా వెళ్లిపోయారు.
ఢిల్లీకి ప్యాకప్ చెప్పిన నిపుణుల బృందం
ఈ నెల ఆరు నుంచి నాలుగు రోజులపాటు కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజిలపై జరిపిన అధ్యయనానికి డ్యామ్‌సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం శనివారం ప్యాకప్ చెప్పేసి ఢీల్లికి బయలు దేరింది. ఢిల్లీనుంచి ఈ నెల 6న ఇక్కడికి చేరుకున్న ఈ బృందం అదే రోజు జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో ప్రాధమిక వివరాల సేకరణ , పరిచయ సమావేశం నిర్వహించింది. ఏడు మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించింది. శుక్రవారం అన్నారం , సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించింది. శనివారం రోజంతా జలసౌధలో కీలక సమావేశం నిర్వహించింది. సాయంత్రం ఆరు గంటలకు సమావేశం ముగించుకుని రాత్రికి ఢిల్లీకి బయలు దేరివెళ్లింది.