Wednesday, January 22, 2025

మెడిటరేనియన్ డైట్‌తో డెమెన్షియా రిస్కు తగ్గుదల

- Advertisement -
- Advertisement -

తృణధాన్యాలు, చిక్కుళ్లు, పప్పులు, గింజలు, విత్తనాలు, తాజా కూరగాయలు, పండ్లు ఆలివ్ ఆయిల్ వీటన్నిటితో కూడిన ఆహారాన్ని మెడిటరేనియన్ డైట్ అని అంటారు. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మెడిటరేనియన్ డైట్ వాడితే మంచిదని వైద్యులు చెబుతుంటారు. మెడిటరేనియన్ అంటే మధ్యధరా సముద్ర తీర ప్రాంత సమీపంలో ఉన్న ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలు ఇలాంటి ఆహారాన్నే తీసుకుంటారు కాబట్టి దీన్ని మెడిటరేనియన్ డైట్ అని పిలవడం పరిపాటి అయింది.

ప్రపంచం మొత్తం మీద ఉత్తమ ఆహారంగా మెడిటరేనియన్ డైట్ గుర్తింపు పొందింది. అయితే ఈ డైట్‌ను తీసుకుంటే డెమెన్షియా వ్యాధి రిస్కు దాదాపు నాలుగు వంతులు తగ్గుతుందని ఇదివరకటి పరిశోధన వెల్లడించడం డెమెన్షియా వ్యాధి నివారణకు కొత్త చికిత్సకు దారి చూపించింది. డెమెన్షియా అన్నది చిత్తవైకల్యం కలిగించే రుగ్మత. మేథస్సు పనితీరులో క్షీణత కలుగుతుంది. మెదడు సరిగ్గా పనిచేయదు. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది. ఈ వ్యాధికి కారణాలు ఇవని చెప్పలేం. వంశపారంపర్యంగా, జీవన విధానం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ.

పెళ్లయిన వారితో పోల్చితే ఒంటరిగా ఉన్న వారిలో డెమెన్షియా ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్కహాలు ఎక్కువగా తీసుకున్నా మత్తుమందుకు అలవాటు పడినా ఈ వ్యాధి రావచ్చు. ప్రపంచం మొత్తం మీద డెమెన్షియాతో బాధపడేవారు కొన్ని లక్షల మంది ఉన్నారు. డెమెన్షియాలో ప్రధానమైనది అల్జిమర్స్. 65 ఏళ్లు దాటిన వారిలో 3 నుంచి 11 శాతం మందికి డెమెన్షియా ఉంటుందని అంచనా. ఇది ఒక వ్యాధి కాదు. వివిధ రుగ్మతల లక్షణాల సమ్మేళనం. వృద్ధాప్యంలో వచ్చే డెమెన్షియా వ్యాధికి చికిత్స లేదని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో డెమెన్షియాకు కొత్త చికిత్స కనుగొనడానికి దారి దొరకడం విశేషం. మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే డెమెన్షియా నుంచి రక్షణ కలుగుతుందని బ్రిటన్ పరిశోధకులు సూచిస్తున్నారు. వ్యక్తిగతమైన జన్యుపర చిక్కులతో సంబంధం లేకుండా ఇది ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. బ్రిటన్ లో సగం మిలియన్ మందిని ఆన్‌లైన్ ద్వారా అధ్యయనం లో చేర్చుకుని పరిశోధనలు సాగించారు. దశాబ్ద కాలంగా ఈ అధ్యయనంలో 882 డెమెన్షియా కేసులు తేలాయి. వేర్వేరుగా ఆహారం తీసుకున్నవారి కన్నా ఎవరైతే కచ్చితంగా మెడిటరేనియన్ డైట్‌ను క్రమబద్ధంగా తీసుకున్నారో వారిలో 23 శాతం వరకు డెమెన్షియా రిస్కు తగ్గినట్టు బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News