Sunday, February 23, 2025

త్వరలో బాధ్యతలు చేపట్టనున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ, మీనాక్షి నటరాజన్

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే పార్టీ పరిస్థితిపై ఆరా…!
కేడర్‌లో భరోసా నింపడానికి కసరత్తు
మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జీల
పనితీరుపై సమాచారాన్ని సేకరించిన మీనాక్షి
త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ, మాజీ ఎంపి మీనాక్షి నటరాజన్ త్వరలో బాధ్యతలను చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోపే మూడో ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్ తన మార్క్‌ను చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ముందున్న పలు సవాళ్లను ఎదుర్కొవడానికి వ్యూహాలను రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఆరా తీసినట్టుగా తెలిసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, కేడర్‌ల మధ్య మనస్పర్ధల గురించి పలువురు సీనియర్‌లను ఆమె అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. నియోజకవర్గాల వారీగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన వ్యూహాల గురించి ఆమె కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆమె రాహుల్‌గాంధీ టీంలో ముఖ్యమైన నేతగా వ్యవహారిస్తున్నారు.

ఇప్పటికే పలువురి పనితీరుపై

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు అందరినీ సమన్వయం చేసుకొని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను విజయతీరాలవైపు తీసుకెళ్లేలా చూడాలని రాహుల్‌గాంధీ ఆమెకు సూచించినట్టుగా తెలిసింది. ఏఐసిసి స్థాయిలో పనిచేసిన, రాహుల్ కోటరీలో కీలక వ్యక్తిగా పేరొందిన మీనాక్షి పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపడుతారన్నది ఆసక్తిగా మారింది. కిందిస్థాయి కేడర్‌లో కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలక్షన్ అబ్జర్వర్‌గా మీనాక్షి నటరాజన్ పనిచేశారు. ఆ సమయంలో పలువురి నేతలను ఆమె దగ్గరి నుంచి పరిశీలించారు. ప్రస్తుతం ఆమెకు రాష్ట్రంలోని పార్టీ కేడర్, సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల గురించి కొంతమేర సమాచారాన్ని ఇప్పటికే సేకరించడంతో పాటు వారి పనితీరును కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఆమె తీసుకుంటారన్న దానిపై కాంగ్రెస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

పార్టీ కార్యక్రమాలను సమర్ధవంతంగా జనాల్లోకి

పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ, కేడర్‌కు భరోసానివ్వడం తదితర అంశాలపై ఆమె ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవడం, రాష్ట్రంలో బిజెపి ఎంపిలు, బిజెపి కేడర్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా ఆమె కేడర్‌ను సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి కేడర్ మధ్య కొన్ని చోట్ల సమన్వయం లేదని, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందని మీనాక్షి నటరాజన్‌కు స్పష్టమైన సమాచారం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాని ప్రభావం క్షేత్రస్థాయి కేడర్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను సమర్ధవంతంగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు కిందిస్థాయి నాయకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో మీనాక్షి నటరాజన్ ముందుగా కిందిస్థాయి కేడర్‌పైనే దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.

నామినేటెడ్, పార్టీ పదవులపై దృష్టి

దీంతోపాటు నామినేటెడ్, పార్టీ పదవులు పంపకం పూర్తిస్థాయిలో జరగలేదు. దానిపై లీడర్లు, కేడర్‌లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతుంది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా పనిచేసిన దీపాదాస్ మున్షీ జిల్లాలో నెలకొన్న విభేదాల గురించి పట్టించుకోలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ మాత్రం జిల్లాల కేడర్‌లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేలా వారితో మాట్లాడడం, ఆయా జిల్లాల ఇన్‌చార్జీ మంత్రులు, జిల్లా సీనియర్ నాయకులతో సమావేశమై వారిని సమన్వయ పరిచేలా చర్యలు చేపట్టాలని ఏఐసిసి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది.

అధికారంలోకి వచ్చిన తరువాత మూడో ఇన్‌చార్జీగా

13 సెప్టెంబర్ 2020 నుంచి జనవరి 2023 వరకు మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా పనిచేశారు. ఆ తర్వాత 4 జనవరి 2023 నుంచి 24 డిసెంబర్ 2023 వరకు మాణిక్ రావు ఠాక్రే ఇన్ చార్జీగా పనిచేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక డిసెంబర్ 2024 నుంచి 14 ఫిబ్రవరి 2025 వరకు దీపాదాస్ మున్షీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా పనిచేశారు. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్‌ను ఇన్‌చార్జీగా ఏఐసిసి నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News