ధాన్యం సేకరణపై రాతపూర్వక హామీ ఇవ్వాలి
ఖరీఫ్ టార్గెట్ పూర్తయింది, ఇంకా కొనుగోలు కేంద్రాల
వద్ద 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది కొనుగోలు
కేంద్రాలు ఉంచాలా? మూసేయాలా? రైతుల నుంచి
సేకరించాక కేంద్రం డబ్బులివ్వకపోతే పరిస్థితేంటి? స్పష్టత
కోసం కేంద్రమంత్రి పీయూష్ రెండురోజులు టైం అడిగారు
రెండురోజుల్లో మళ్లీ కలిసి స్పష్టత వచ్చాకే వెళ్తామని
చెప్పాం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ బిడ్డగా బాధ్యత
లేదా? వచ్చే యాసంగికి గింజ కూడా కొనమని తేల్చి
చెప్పేశారు ఎఫ్‌సిఐ బియ్యం తరలించకపోతే మా తప్పు
కాదని చెప్పాం : ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తర్వాత
మీడియాతో రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి
“ఎఫ్‌సిఐ అధికారులు గోడౌన్లలో మూలుగుతున్న బియ్యం తరలించకపోతే అది మా తప్పుకాదు. ప్రతి రోజు 30 నుంచి 40 టన్నుల బియ్యాన్ని తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. నెలకు 10లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిల్లింగ్ చేసి ఇచ్చే సామర్ధం తెలంగాణకు ఉందని కేంద్రమంత్రికి చెప్పాం. అప్పుడు పీయూష్ గోయెల్ స్పందించి అయితే మా బియ్యం మేం తరలించుకుటాం, సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తాం అని చెప్పారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ కోరాం. రెండు రోజుల టైం అడిగారు. మళ్లీ రెండ్రోజుల్లో కలిసి ఏదో ఒకటి తేలాకే ఇక్కడి నుంచి వెళ్తాం”
పీయూష్‌తో భేటీ అనంతరం రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చాకే ఢిల్లీనుంచి తెలంగాణకు తిరిగి వెళతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణ అంశంపై మంగళవారం నాడు నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు , గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితర రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర ఆహార , ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమై పలు అంశాలను చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ 60లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ బుధవారం నాటికి పూర్తవుతుందన్నారు. ఇంకా 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉందని తెలిపారు. ఇంకో 5లక్షల ఎకరాల్లో వరి కోతలు జరగుతున్నాయని , జనవరి 15నాటికిగాని ఈ ధాన్యం అందుబాటులోకి వస్తుందన్నారు.
మిగిలిన ధాన్యాన్ని సేకరించాలా వద్దా అని సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌నుంచి స్పష్టత కోరామన్నారు . రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంచాలా లేక మూసివేయాలా అని అడిగామన్నారు. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు చేసిన తర్వాత కేంద్రం నుంచి డబ్బులివ్వకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు.ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ కోరామని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి గోయల్ ఈ విషయం పైన స్పష్టత ఇచ్చేందుకు తనకు రెండు రోజుల సమయం కావాలని కోరారని తెలిపారు. అయితే తాము రెండు రోజుల తర్వాత మళ్లీ కలుస్తామని , అప్పటివరకూ ఇక్కడే ఉంటామని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై తేల్చుకున్నాకే తెలంగాణకు తిరిగి వెళతామని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర బిజెపి నేతల మాటలను కూడా సమావేశంలో కేంద్ర మంత్రి గోయల్ ఎదుట ప్రస్తావించినట్టు తెలిపారు. ఎఫ్‌సిఐ అధికారులు బియ్యం తరలించడం లేదనే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయామన్నారు. ఎఫ్‌సిఐ అధికారులు బియ్యం తరలించకపోతే అది మా తప్పు కాదని గోయల్‌కు వివరిచినట్టు తెలిపారు.
నెలకు 40లక్షల టన్నుల దాన్యం మిల్లింగ్ చేసే సామర్థం తెలంగాణ రాష్ట్రంలోని మిల్లింగ్ వ్యవస్థకు ఉందని తెలిపామన్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన కేంద్రమంత్రి గోయల్ తమ బియ్యాన్ని తాము తెచ్చుకుంటామని తెలిపారన్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి గత సీజన్‌కు సంబంధించిన బియ్యం నిల్వలను కూడా తెప్పించుకుంటామన్నారని , తమ ముందే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారని తెలిపారు. వచ్చే యాసంగి సీజన్‌లో బియ్యం కొనమని కేంద్ర మంత్రి మరోసారి వెల్లడించారన్నారు. తాము రైతుల పక్షాన రాష్ట్రం నుంచి ఇక్కడి వచ్చామే తప్ప రాజకీయం కోసం కాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలగాణ బిడ్డ అయివుండి కూడా ఆయనకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం ఉత్పత్తి ఎక్కువ వస్తుందన్నారు. ఏడేళ్ల కిందట 35లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి ఉంటే ,నేడు 3కోట్ల టన్నులకు చేరుకుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తమ సొంత నిధులతో కట్టుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు.కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ధాన్యం సేకరణ కూడా సరిగ్గా చేయడం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సమావేశంలో మంత్రుల బృందం తోపాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వర్ రావు, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.