40 అంశాలతో పరిష్కార వ్యూహం
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన బుధవారం జరిగింది. సుమారు ఈ భేటీ మూడుగంటలకు పైగా జరిగింది. 40 అంశాలతో కూడిన పరిష్కార మార్గాలను సబ్ కమిటీ సిద్ధం చేసింది. ఇప్పటికే 21 రకాల సమస్యలను ప్రభుత్వం గుర్తించగా, అన్నింటికి కోర్టుకు వెళ్లకుండా కలెక్టర్లకు బాధ్యతలు కట్టబెట్టేలా ప్రతిపాదనలు చేసినట్లుగా తెలిసింది. మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించడంతో పాటు రానున్న రోజుల్లో స్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వాటికి పరిష్కార మార్గాలను సూచించేలా నిర్ణయం ఉండాలని సబ్ కమిటీ భావించింది.
అందులో భాగంగా ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలను ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది. ఈ సమస్యలకు సంబంధించి గతంలో తహసీల్దార్లు లేవెనెత్తిన పలు అంశాలు, వాటి పరిష్కారాల గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం. మరోమారు సమావేశం తరువాతే దీనిపై నివేదికను రూపొందించాలని అనంతరం సిఎం కెసిఆర్‌కు కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సిఎం పరిశీలించి ఆమోదించిన అనంతరమే కలెక్టర్లకు సిఎస్ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టుగా సమాచారం.
మంత్రిని కలిసిన ట్రెసా నాయకులు
ధరణిపై కేబినెట్ సమావేశం నేపథ్యంలో ట్రెసా నాయకులు బుధవారం ఉదయం మంత్రి హరీష్‌రావును కలిశారు. ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు మన్నే ప్రభాకర్, కార్యదర్శి శైలజ, నిరంజన్ తదితరులు ఉన్నారు.