పోర్టల్ బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం: కమిటీ
‘ధరణి’ లొసుగులపై కలెక్టర్‌లతో చర్చిస్తున్నాం
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం : ధరణి కమిటీ సభ్యులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ధరణి’లో నెలకొన్న స మస్యలపై త్వరలోనే కొన్ని జిల్లాల కలెక్టర్‌లతో సమావేశం కావాలని నిర్ణయించామని, త్వరలోనే ప్రభుత్వాని కి నివేదిక అందచేస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు. సోమవారం సిసిఎల్ కార్యాలయంలో ధరణి కమిటీ సభ్యులు మూడోసారి ధరణి సమస్యలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధరణి కమటీ సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భగా ముందుగా రేమండ్ పీటర్ మాట్లాడుతూ ‘ధరణి’ లొసుగులపై చర్చిస్తున్నామని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మీ సేవలో ఉన్న సమస్యలు, అగ్రికల్చర్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా సమావేశం అవుతామన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సమయం పడుతుందన్నారు. నివేదిక వచ్చాక ప్రభు త్వం ‘ధరణి’పై స్పందిస్తుందని రేమండ్ పీటర్ తెలిపారు. ధరణి పోర్టల్‌తో పాటు మెరుగైన భూ పరిపాలన అందించేందుకు అవసరమైన మార్పులను కూడా తాము అందిస్తామన్నారు. అలాగే ఆర్‌ఓఆర్ 2020కి సవరణలు అనివార్యమని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లోని భూముల డేటాను క్రోఢీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మూడింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పడనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒకేసారి నివేదికను అందించకుండా తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వేర్వేరుగా మార్గాలను అందించనున్నట్టు ఆయన తెలిపారు. ధరణి లేదా ఇతర ఏ సాఫ్ట్‌వేర్ అమలు చేసినా ఏదైనా అప్లికేషన్ చేస్తే ఆమోదించినా, తిరస్కరించినా సమాచారం రావాలి. ఎందుకు తిరస్కరించారో కూడా దరఖాస్తుదారుడికి సమాచారం అందాలి. ప్రతిదీ సర్వర్‌లో నిక్షిప్తం కావాలి. ధరణి పోర్టల్లో అలాంటి వ్యవస్థ ఉందా? లేదా? అన్నది పరిశీలిస్తున్నామన్నారు.
‘ధరణి’పై చాలామంది కోర్టుకి వెళ్లారు: సునీల్
‘ధరణి’ కమిటీ సమస్యలను పరిష్కరించదని, మార్పులు, చేర్పులు, సలహాలు ఇస్తుందని ధరణి కమిటీ సభ్యులు సునీల్ తెలిపారు. ఇందులో ఉన్న సమస్యలను జిల్లా పరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. ధరణి ఒక్కటే సమస్య కాదనీ, ఇతర డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా చర్చించాలన్నారు. రాష్ట్రంలో భూముల వివరాలను కంప్యూటర్లలో రికార్డుల్లోకి ఎక్కించారన్నారు. ‘ధరణి’ సమస్యలపై చాలామంది కోర్టుకి వెళ్లారన్నారు. రైతుకు భూమి ఉండి రికార్డులో భూమిని నమోదు చేయకపోతే వారు చాలా ఇబ్బంది పడుతున్నారని సునీల్ చెప్పారు. ధరణికి సం బంధించిన సమస్యలపై అధ్యయనం వేగవంతం చేశామన్నారు. కంప్యూటర్ రికార్డుతో మెరుగైన సేవలందాలి, కానీ, కొత్త సమస్యలు సృష్టించేటట్లుగా ఉండొద్దన్నారు కం ప్యూటర్‌లో రికార్డు వాస్తవానికి అద్దం పట్టేటట్లుగా ఉండాలన్నారు. ధరణి పోర్టల్లో సమస్యలను అనేకం గుర్తించామని, అయితే వాటి మూలాలను పరిశీలిస్తున్నామని ఆ యన తెలిపారు. ఆర్‌ఓఆర్ 2020లోనూ కొన్ని మార్పు లు అవసరమని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది
మధ్యంతర కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇస్తుందని ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి అన్నారు. లక్షల మంది రైతులు భూమికి సంబంధించిన పాసుబుక్‌లు లేకపోవడంతో వారికి లబ్ధి చేకూరడం లేదన్నారు. చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధరణి పోర్టల్ని విదేశీ కంపెనీకి అప్పగించడం పొరపాటేనని సిఎం రేవంత్ రెడ్డి గుర్తించారని, తన మొదటి సమీక్షలోనూ ఇదే అభిప్రాయాన్ని సిఎం చెప్పారని ఆయన తెలిపారు. అయితే విదేశీ కంపెనీతో ఒప్పందం ఇప్పటికే అయిపోయిందని త్వరలోనే వేరే కంపెనీకి అప్పగించడమా లేదా కేంద్ర ప్రభుత్వ పరిధిలో వేరే వ్యవస్థకు అప్పగించడం అన్న విషయమై సిఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. అక్రమ భూ లావాదేవీల విషయాలను కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. పత్రికల్లో అనేక కథనాలు వస్తున్నాయి. రోజూ చూస్తున్నాం. దీనికంతటికీ ధరణి మూలమేనన్నారు. 2018 కంటే ముందు భూమి హక్కు ల విషయంలో కొన్నే సమస్యలు ఉండేవి. ధరణి అమలైన తర్వాతే ఈ సమస్యలు తీవ్రమయ్యాయన్నారు. వేల ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు వస్తుందని, చిన్న చిన్న కారణాలతో ఎకరం, రెండెకరాలు ఉన్నోళ్లకు సాయం అందడం లేదన్నారు. ఏ అంశాన్ని ధరణి కమిటీ వదలదని, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్, ప్రభుత్వం, సీలింగ్, అసైన్డ్ వంటి అన్నింటిపై అధ్యయనం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిఎంఆర్‌ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.