హైదరాబాద్ : ప్రధాన మైన అనేక అంశాలపై చర్చించడానికి కనీసం 20 రోజులకు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు. వరదలు, పంట, ఆస్తి నష్టం, ధరణి, పోడు, అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలు, నిరుద్యోగం, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు, బిసి సబ్‌ప్లాన్, సింగరేణి, స్వయం ఉపాధి, ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్, ప్రభుత్వ భూముల అమ్మకాలు, మైనారిటీల సమస్యలపై స్వల్పకాలిక చర్చకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమైన సమస్యలపై చర్చిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని దీంతో రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరుగుతుందని ఆయనన్నారు.
ప్రతిపక్ష సభ్యుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని భట్టి విక్రమార్క సూచించారు. గత తొమ్మిదేళ్లుగా ఇదేమి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. తను డిప్యూటీ స్పీకర్ హోదాలో తెలంగాణ బిల్లు సమయంలో స్వయంగా తనే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు చాలా సార్లు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ప్రతిపక్ష సభ్యులపై వివక్ష చూపడం సరికాదన్నారు. చివరి అసెంబ్లీ సమావేశాలు అయినందున ఇప్పుడైనా ప్రజోపయోగ అంశాలపై చర్చ జరుగాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.