Monday, December 23, 2024

శ్వేత విప్లవానికి చేయూతగా మెగా డెయిరీ

- Advertisement -
- Advertisement -

రోజుకు 8లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యం
నెలకు 30 లక్షల టన్నుల వెన్న తయారీ
ఆరు లక్షల మంది పాడి రైతులకు ప్రయోజనం
5న మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన మెగా డెయిరీ శ్వేత విప్లవానికి చేయూతగా నిలవబోతోది. రోజుకు 8లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేయటంతోపాటుగా నెలకు 30లక్షల టన్నుల వెన్న తయారీ చేసే ఈ భారీ ప్రాజెక్టు ద్వారా పాడి పరిశ్రమనే నమ్ముకుని జీవిస్తున్న ఆరు లక్షలమంది పాడి రైతలకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ విజయ ఫెడరేషన్ కి చెందిన మెగా డెయిరీ అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రావిర్యాల్ గ్రామ (ఇమారత్ కంచ) పరిధిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మెగా డెయిరీని ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 12.౦౦ గంటలకు రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల అభివృద్ధి శాఖ, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తెలిపారు.

నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి) సహకారంతో 5 లక్షల నుంచి 8 లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యంతో దేశంలోనే అత్యాధునికంగా, పూర్తిస్థాయి ఆటో మిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ఈ మెగా డెయిరీ నిర్వహణ కోసం సోలార్ విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థతో పాటు, వ్యర్ధాల వినియోగంతో తయారైన విద్యుత్ ను ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డెయిరీ ప్రారంభ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి , సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలతో పాటుగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు,శాసన సభ్యులు హాజరవుతారని ఆయన తెలిపారు.

మెగా డెయిరీ ఏర్పాటు డెయిరీ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలవనున్నదని అన్నారు. పూర్తిగా సహకార రంగంలో నిర్వహించబడుతున్న విజయ డెయిరీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి ముందు తీవ్ర నిరాదరణకు గురై నష్టాల ఊబిలో కూరుకపోయి ఒకానొక దశలో మూతపడే స్థితిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో నేడు లాభాల బాట పట్టిందని చెప్పారు. విజయ డెయిరీకి చెందిన పాలు, పాల ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉన్నప్పటికీ నాటి పాలకులు నిర్లక్ష్యం చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు.

తెలంగాణా ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న ఉత్పత్తులకు అదనంగా నూతన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో విజయ ఉత్పత్తి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. పోటీ మార్కెట్ లో ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఔట్ లెట్ల ఏర్పాటుతో లాభాల బాటలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. పాడి రైతులను ప్రోత్సహించే విధంగా విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు అనేక ప్రోత్సాహకులు అందజేస్తున్నట్లు తెలిపారు.

సబ్సిడీ పై పాడి గేదెల పంపిణీ, గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. లీటర్ పాలకు 4 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని విజయ డెయిరీకి పాలు పోసే రైతులకే కాకుండా ఇతర సహకార డెయిరీలకు చెందిన రైతులకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు తో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు వైద్య శిభిరాల ఏర్పాటు, వ్యాక్సినేషన్ నిర్వహణ, తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా కృత్రిమ గర్భధారణ శిభిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనేక కార్యక్రమాల ద్వారా విజయ డెయిరీ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజులల్లో విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసి ప్రధమ స్థానంలో నిలుపుతామని పశుసంవర్ధక ,పాడి పరిశ్రమ శాఖల మంత్రి స్పష్తం చేశారు.

మెగా డెయిరీ సమగ్ర సమాచారం:
రోజుకు 5 లక్షల నుండి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ సామర్ధ్యం కలిగి ఉన్నది. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ఉత్పత్తి, నెలకు 30 టన్నుల వెన్న తయారీ, రోజుకు 10 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే మిషనరీ ని ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 5 వేల నుండి 10 వేల లీటర్ల ఐస్ క్రీం తయారీ సామర్ధ్యం కలిగిఉంది. రోజుకు 20 టన్నుల పెరుగు ఉత్పత్తి సామర్ధం కలిగింది. రోజుకు 12 వేల లీటర్ల మజ్జిగ, లస్సీ తయారీ చేయనుంది. ఈ మెగా డెయిరీ తో సుమారు లక్షల మంది కి పైగా పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News