మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రంగా ‘విశ్వంభర’ పట్టాలెక్కిన నాటి నుంచి తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో అవుతుంది? అన్న దానిపై స్పష్టత ఏర్పడింది. చిరంజీవి 157వ సినిమా విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. సీనియర్ డైరెక్టర్ల నుంచి యంగ్ డైరెక్టర్ల వరకూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా 157వ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. 157వ చిత్రంగా అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ మొదలవుతుంది. దీన్ని సాహుగారపాటి నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా తెలియజేశారు.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు. అనీల్ రావిపూడితో సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమన్నారు. ఆ సినిమా సెట్‌లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆయా సన్నివేశాల గురించి అనీల్ చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నానున్నారు. దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో? అనీల్ తో అలాంటి ఫీలింగ్ కలుగుతుందన్నారు.