మేఘాలయ గవర్నర్ సత్యపాల్
భగ్‌పత్ : అగ్నిపథ్ సైనిక ఉద్యోగావకాశం కాదు యువతను దగా చేయడమే అని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ స్కీంను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు. జవాన్లు కాగోరే వారి పట్ల ఈ స్కీం పూర్తి స్థాయి అపహాస్యం వ్యక్తంచేస్తోంది. రిటైరయిన తరువాత పింఛన్లు ఉండకపోవడం ప్రయోజనకరం అవుతుందా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు చిన్నతనంలోనే సైనికులుగా చేరి అగ్నివీరులు అయ్యి బయటకు ఖాళీ చేతులతో నిరుద్యోగంతో వస్తే వారికి పెళ్లిళ్లు అవుతాయా? అని సత్యపాల్ ప్రశ్నించారు. యువప్రాయపు వారికి ద్రోహం చేసే ఈ స్కీంను రద్దు చేయాల్సి ఉంటుంది. లేదా తగు విధంగా దీనిని మార్చాలనిఆయన కేంద్రానికి సూచించారు. యువత కాంట్రాక్టు పద్ధతిలో ఈ స్కీం ద్వారా సైన్యంలో చేరడం వల్ల ఎవరికి ఉపయోగం? వారికి మేలు జరగదు, అదే విధంగా యువత కూడా తగు విధంగా ప్రయోజనాలు పొందదని ఇంతకు ముందు జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన అనుభవమున్న మాలిక్ తెలిపారు.
అగ్నివీరులవుతారని వారిని సైనికులుగా తీసుకుని తరువాత వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా ఈ స్కీం ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య బీమాలు ఉండవు. తరువాతి జీవితాలు గడిపేందుకు పించన్లు దక్కవు. చేసేందుకు ఉద్యోగాలు రావు. వ్యక్తిగత జీవితాలను వెక్కిరిస్తూ వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రారని విశ్లేషించారు. ఉత్తరప్రదేశ్‌లోని భగ్‌పత్‌కు చెందిన గవర్నర్ మాలిక్ తన చిన్ననాటి కుటుంబ స్నేహితుడు గజే సింగ్ ధమా ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు సమీపంలోని ఖేక్రా గ్రామానికి వెళ్లిన సందర్భంగా విలేకరుల వద్ద అగ్నిపథ్‌పై తమ అభిప్రాయాలు తెలిపారు. అగ్నిపథ్‌పై తాను త్వరలోనే యువతను కలుసుకుని వారి నిర్థిష్ట అభిప్రాయాలను తెలుసుకుంటానని చెప్పారు.