పోలీసు వాహనం హైజాక్ తరువాత నిప్పు
షిల్లాంగ్ : మేఘాలయాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆదివారం అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి లఖ్మేన్ ర్యింబూయి పదవికి రాజీనామా చేశారు. రాజదాని షిల్లాంగ్‌లో పూర్తిస్థాయి కర్ఫూ విధించారు. ఇక్కడ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోనూ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. షిల్లాంగ్‌లో మంగళవారం వరకూ కర్ఫూ అమలులో ఉంటుందని పేర్కొంటూ ఆదివారం ఉదయం హుటాహుటిన విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు.షిల్లాంగ్‌లోని జైవావూ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు.
మావ్‌క్కిన్రోహు పోలీసు ఔట్‌పోస్టుకు చెందిన ఈ వాహనంలో ఉన్నతాధికారి ఇతర పోలీసు సిబ్బంది ఉండగానే దీనికి దుండగులు నిప్పుపెట్టడం కలకలం రేపింది. వాహనంలో ఉన్నవారు తప్పించుకుని సురక్షితంగా వెళ్లారు. ఓ వ్యక్తి పోలీసుల ఆయుధాన్ని లాక్కుని వాహనాన్ని తన అదుపులోకి తీసుకుని దీనిని కొద్ది సేపు తిప్పి తరువాత తగులబెట్టినట్లు వెల్లడైంది. మాజీ రెబెల్ నేత చెరిష్‌స్టార్‌ఫీల్డ్ నివాసంపై పోలీసు దాడి దశలోనే ఆయన చనిపోవడంతో షిల్లాంగ్‌లో ఉద్రిక్తత ఏర్పడిందని స్పష్టం అయింది. పోలీసుల దారుణ హత్యాకాండ ఇదని చెరిష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వందలాది మంది నల్ల దుస్తులు, జెండాలు ధరించి రోడ్లపై తిరిగారు. అంత్యక్రియలలో పాల్గొన్నారు.