యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు
షిల్లాంగ్: ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదల తాత్కాలిక జాబితాలో మేఘాలయాలోని 70 పైచిలుకు గ్రామాలలో కనిపించే చెట్ల వేళ్లతో తయారుచేసిన వంతెనలకు(లివింగ్ రూట్ బ్రిడ్జీలు) చోటు దక్కింది. ప్రజలకు, ప్రకృతికి మధ్య అవినాభావ సంబంధాన్ని ప్రతిబింబించే ఈ వంతెనలను మేఘాలయ ప్రజలు మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి అమర్చుకున్నారు. మేఘాలయ ప్రజల సామాజిక-సాంస్కృతిక సంబంధాలను, సామాజిక-వృక్ష అనుబంధాన్ని ఈ వంతెనలు ప్రతిఫలిస్తాయి.
అక్కడి ప్రజలు తమకు అందుబాటులో ఉన్న వనరులను అవసరానికి అనుగుణంఆ మలచుకోవడంతోపాటు చెట్ల నుంచి వేళ్లను వేరు చేయకుండా వాటని అలానే ఉంచి వాటిని తాళ్లుగా అల్లి వంకలు, వాగులపై వంతెనలు నిర్మించుకుని వాటిని దాటుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల తాత్కాలిక జాబితాలో మేఘాలయాలోని జింగ్‌కీంగ్ లివింగ్ రూట్ బ్రిడ్జి స్థానం దక్కించుకోవడం సంతోషంగా ఉందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌రాడ్ కె సంగ్మా మంగళవారం ట్వీట్ చేశారు. మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు వాగులు, వంకలకు రెండు వైపులా రబ్బరు చెట్లను(ఫైకస్ ఎలాస్టికా) పెంచుతుంటారు. ఇవి 10, 15 ఏళ్లు పెరిగిన తర్వాత వేటి వేళ్లు బలంగా ఎదిగి వంతెనలుగా ఏర్పడేందుకు తోడ్పడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 72 గ్రామాలలో ఇలాంటి చెట్ల వేళ్లతో తయారుచేసిన 100కు పైగా వంతెనలు ఉన్నాయి.