బిజెపి నాయకుడు బిఎస్ యెడియూరప్ప మాజీ ముఖ్యమంత్రి అయినందున పోక్సో కేసులో ఆయన అరెస్టును కర్నాటక హైకోర్టు నిలుపుదల చేయడం న్యాయానికి విరుద్ధంగా ఉందని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆదివారం విమర్శించారు. అందుకు భిన్నంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఉదంతాలను ఆమె ఉదహరించారు. వారిని ‘ఇంకా తక్కువ అభియోగాలపై’ జైలులో పెట్టారని ఆమె ఆరోపించారు.
‘నిందితుడు బిజెపి నేత బిఎస్ యెడియూరప్ప మాజీ సిఎం అని పేర్కొంటూ పోక్సో కేసులో ఆయన అరెస్టుపై కర్నాటక హైకోర్టు స్టే ఇవ్వడం మరొక మాజీ సిఎంహేమంత్ సోరెన్, సిట్టింగ్ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పట్ల వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఉంది. వారిద్దరు ఇంకా తక్కువ అభియోగాలపై నెలలుగా జైలులో ఉన్నారు. ఇది న్యాయ నిర్ణయం ఎలా ఉంటుందో బహిర్గతంచేస్తోంది’ అని మెహబూబా ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.