శ్రీనగర్: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తల్లి గుల్షన్ నజీర్ బుధవారం ఇక్కడి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట హాజరయ్యారు. సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఇడి కార్యాలయం వద్దకు 70 ఏళ్లకు పైబడిన వయసులో ఉన్న గుల్షన్ నజీర్ తన కుమార్తెతో కలసి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మాజీ కేంద్ర హోం మంత్రి, జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ముఫ్తి మొహమ్మద్ సయీద్ భార్య అయిన గుల్షన్ నజీర్‌పై గతంలో మూడు సందర్భాలలలో ఇడి సమన్లు జారీచేసింది. అయితే ఈ ఆరోపణలను రాజకీయ కక్షసాధింపు చర్యగా మెహబూబా ముఫ్తి ఆరోపిస్తున్నారు. పూర్వ జమ్మూ కశ్మీరు రాష్ట్రంలో పిడిపి అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి విచక్షణాధికారాలతో కూడిన నిధులను అక్రమంగా నజీర్‌తోపాటు మరి కొందరి ఖాతాలకు మళ్లించడంపై మనీలాండరింగ్ చట్టం కింద ఇడి కేసులు నమోదు చేసింది. దీనిపై ప్రశ్నించేందుకు గుల్షన్ నజీర్‌కు ఇడి సమన్లు జారీచేసింది.
Mehbooba’s mother appears before ED in Srinagar