సిబిఐ, ఇడి విజ్ఞప్తి మేరకు అదుపులోకి తీసుకున్న అక్కడి
పోలీసులు రూ.13,850 కోట్ల మేర పంజాబ్ నేషనల్
బ్యాంక్‌ను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఛోక్సీ
స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు
న్యూఢిల్లీ : వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను రూ.13,850 కోట్ల మేరకు మోసంచేసి విదేశాలకు పారిపోయిన మెహుల్ ఛోక్సీని అరెస్ట్ చేసినట్లు బెల్జియం ధ్రువీకరించింది. మెహుల్ చోక్సీని తమకు అప్పగించాలన్న భారతదేశం అభ్యర్థనను ఆ ప్రభుత్వం పరిశీలిస్తోంది. 65 ఏళ్ల ఛోక్సీ 2018 జనవరి 2న మనదేశం నుంచి విదేశాలకు పరారయ్యాడు. అప్పటి నుంచి అతడిని విదేశాల్లో పట్టుకుని మన దేశానికి రప్పించేందుకు సీబీఐ, ఈడీ కృషిచేస్తున్నాయి. ఏ ప్రిల్ 12న ఛోక్సీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తమదేశంలోనే నిర్బంధించినట్లు బెల్జియం న్యాయ శాఖ సోమవారం ప్రకటించింది. అంతకుమించి బెల్జియం వివరాలను ప్రకటించలేదు. మెహుల్ ఛోక్సీ, తన సహచరులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై, 2014నుంచి 2017 వరకూ ఆ బ్యాంక్ నుంచి లెటర్స్ ఆఫ్ అండర్, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ లను మోసపూరితంగా పొం దాడు. ఫలితంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రు.6,097 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేరంలో అతడి మేనల్లుడు నీరవ్ మోడికి కూడా ప్రమేయం ఉంది. మెహుల్ ఛోక్సీ
అరెస్ట్ మోడీ సర్కార్ సాధించిన భారత దౌత్య విజయం అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ తెలిపారు. ఛోక్సీని అప్పగించాలన్న బెల్జియం నిర్ణయం గొప్పది అని, అయితే అందుకు చాలా సమయం పట్టవచ్చునని మాజీ దౌత్యవేత్త కెపి ఫాబియన్ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ముంబై టెర్రర్ దాడుల్లో నిందితుడు తవూర్ రాణాను అమెరికా నుంచి రప్పించడానికి 17 సంవత్సరాలు పట్టిందని గుర్తుచేశారు. ఛోక్సీ విషయంలో ఆ విధంగా ఏళ్లు పట్టకుండా త్వరలోనే అప్పగింత జరగవచ్చునని ఆశిస్తున్నట్లు ఫాబియన్ తెలిపారు.బెల్జియంలో ఛోక్సీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ అపీల్ చేస్తామని, అలాగే భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామని మెహుల్ ఛోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ తెలిపారు. కేసు రాజకీయ స్వభావంతో కూడుకుని ఉండడం, భారతదేశంలో ఛోక్సీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్స పై ఆందోళనలు అన్న రెండు కారణాలపై తాము అప్పగింతను సవాల్ చేస్తామని ఆయన చెప్పారు.
స్విట్జర్లాండ్ కు పరారయ్యేందుకు యత్నించిన ఛోక్సీ
మెహుల్ ఛోక్సీ స్విట్జర్లాండ్ కు పరారయ్యేందుకు యత్నించాడు. 2018లో భారతదేశంనుంచి పరారైన ఛోక్సీ ఆంటిగ్వాకు చేరి అక్కడి పెట్టుబడి కార్యక్రమం సాకుతో సిటిజన్ షిప్ తీసుకున్నాడు. 2021 లో తమ దేశంలో అక్రమంగా ప్రవేశించినందుకు డొమినికన్ రిపబ్లిక్ లో అరెస్ట్ చేశారు. ఛోక్సీ చికిత్సకోసం ఆంటిగ్వా రావాలని తర్వాత విచారణకు డోమినికల్ రిపబ్లిక్ కు తీసుకువస్తామని ఆ దేశకోర్టుకు ఛోక్సీ న్యాయవాదులు చెప్పారు. 51 రోజుల జైలు శిక్ష తర్వాత ఛోక్సీకి బ్రిటీష్ క్వీన్స్ ప్రివీ కౌన్సిల్ నుంచి ఊరట దక్కడంతో ఆంటిగ్వా వెళ్లాడు. తర్వాత ఏడాదికి అతడు బెల్జియంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సీబీఐ, ఈడీ ఆ దేశంలోని ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. శనివారం బెల్జియం పోలీసులు మెహుల్ ఛోక్సీని అరెస్ట్ చేసినప్పుడు అతడు స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు, అందుకు అవసరమైన పత్రాలు దొరకడంతో వెల్లడైంది.