గౌహతి: మణిపూర్‌లో మైతీలు, కుకీల మధ్య జాతి ఘర్షణలు తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. గిరిజన మహిళలను మైతీలు నగ్నంగా ఊరేగించడం, వారిపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడడం వంటి దారుణాలు జరుగుతుండడం మిజోరంలోని మైతీలపై కూడా పడింది. ఈ సంఘటనలపై మిజోరంలోని మాజీ మిలిటెంట్ గ్రూపు స్పందించింది. భద్రత దృష్టా మైతీలు మిజోరంను వీడి వారి సొంతరాష్ట్రమైన మణిపూర్‌కు వెళ్లిపోవాలని హెచ్చరించింది. మే 4న మణిపూర్‌లో జరిగిన అమానుష ఘటనలపై కుకీలకు అనుకూలంగా ఉన్న మిజో యువకులు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిజోరంలోని మైతీలపై దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈ మేరకు ‘పీస్ అకార్డ్ ఎంఎన్‌ఎఫ్ రిటర్నీస్ అసోసియేషన్’( పిఎఎంఆర్‌ఎ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ హెచ్చరికలతో మిజోరంలోని మైతీల్లో చాలా మంది శనివారం తమ సొంత రాష్ట్రానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. మిజోరాం రాజధాని ఐజాల్‌లో దాదాపు 2000 మంది మైతీలు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు, వర్కర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది అసోంలోని భద్రక్ లోయనుంచి వచ్చిన వారే ఉన్నారు. కాగా మిజోరాంలో ప్రభావవంతమైన సివిల్ సొసైటీ గ్రూపు సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ కూడా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న మైతీలకు ఇలాంటి సూచనలు జారీ చేసింది. అలాగే మిజోరాం ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత రాష్ట్రంలోని మైతీల డేటా సేకరించే ప్రతిపాదనను మిజో స్టూడెంట్స్ యూనియన్ నిలిపివేసింది.
ఈ హెచ్చరికల దృష్టా శనివారం మధ్యాహ్నానికే చాలా మంది మైతీలు తమ సొంత రాష్ట్రానికి బయలుదేరారు. మరో వైపు మైతీలు సురక్షితంగా ఐజాల్ వదిలిపెట్టి వెళ్లేందుకు వీలుగా నాలుగు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని నియమించాలని మిజోరాం ఉత్తర రేంజి డిఐజి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్రంలోని మైతీలకు ఎలాంటిప్రమాదం లేదని,తాము పిఎఎంఆర్‌ఎతో మాట్లాడామని, తమ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని , అది బెదిరింపు కాదని, కేవలం ఆందోళన మాత్రమేనని వారు చెప్పారని మిజోరాం హోం శాఖ ప్రతినిధి చెప్పారు. అయితే చాలా మంది మైతీలు భయంతో తమకు చెందిన వస్తువులను ఇక్కడే తమ అద్దె ఇళ్లలో వదిలిపెట్టి పారి పోతున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ వర్గానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి చెప్పడం గమనార్హం.