న్యూయార్క్ : వైరస్ నిరోధక ఔషధం అయిన మెల్‌నూపిరవిర్ కొవిడ్ 19 వైరస్ సంక్రమణను నివారిస్తుంది. దీనిని తీసుకున్న 24 గంటల వ్యవధిలోనే కొవిడ్ వైరస్ దెబ్బతింటుందని పరిశోధకుల పూర్తిస్థాయి విశ్లేషణలో నిర్థారించారు. కొవిడ్ రాకుండా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వైరస్ సోకకుండా చేసేందుకు ఈ సరికొత్త యాంటివైరల్ డ్రగ్ బాగా పనిచేస్తుంది. దీనిని శాస్త్రీయంగా ఎంకె 4482/ఇఐడిడి 2801 అని వ్యవహరిస్తారు. ఈ వైరల్ నియంత్రణ ఔషధానికి మోల్‌న్యూపిరవిర్ అని పేరు పెట్టారు. వైరస్ సంక్రమణ తలెత్తకుండా ఈ మందు తీసుకున్న తరువాత కేవలం 24 గంటలలోనే మనిషి నిరోధక శక్తిని పొందుతారని వెల్లడైంది. పరిశోధనకర్తలు వెల్లడించిన అంశాన్ని జర్నల్ నేచర్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. జార్జియా స్టేట్ యూనివర్శిటీ (జిఎస్‌యు)కి చెందిన పరిశోధక బృందం ఈ డ్రగ్ సమర్థత గురించి పరిశీలించారు. ఈ క్రమంలో ఇది ఫ్లూ కారక వైరస్‌లను అంతమొందిస్తుందని ఈ వర్శిటీ పరిశోధకులు గుర్తించారు.
ఈ ఔషధం కొవిడ్ వ్యాక్సిన్ ఆటకట్టుకు కూడా బాగా పనిచేస్తుందనే విషయాన్ని నిర్థారించున్నట్లు వెల్లడైంది. త్వరితగతిన సార్క్ వైరస్ శరీరంలోకి వ్యాపించకుండా ఈ ఔషధం పనిచేస్తుంది. ఇది కొవిడ్‌కు బాగా పనిచేస్తుందనే విషయం నిర్థారణ కావడంతో ఇక కరోనా నివారణ విషయంలో ఇది కీలక పరిణామం అవుతుందని పరిశోధనల వ్యాసకర్త రిచర్డ్ ప్లెంపెర్ తెలిపారు. దీనిని నోటిద్వారా తీసుకోవల్సి ఉంటుంది. కరోనా సోకే ప్రమాదం ఉన్న వారు దీనిని సకాలంలో తీసుకోవడం జరిగితే మూడువిధాలుగా ఇది ఉపయోగపడుతుంది. దీనిని సకాలంలో తీసుకుంటూ పోవడం వల్ల వ్యక్తులు తీవ్రస్థాయిలో వైరస్‌ను కొనితెచ్చుకోకుండా తమను తాను రక్షించుకోగలరని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు అయితే ఇటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటే ఈ క్రమంలో అత్యధిక సంఖ్యలో వైరస్ సంక్రమణ నివారణకు వీలేర్పడుతుంది. ఈ విధంగా అంతాసామాజిక ఆర్థిక అంతకు మించి అత్యంత సున్నిత స్థాయిలో తలెత్తే మానసిక భయాలు, భావోద్వేగాలు లేకుండా చేసేందుకు దారితీస్తుందని స్పష్టం అయింది.