Thursday, January 23, 2025

ఓ దళిత కమ్యూనిస్టు జ్ఞాపకాలు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర వాసి అయిన కామ్రేడ్ మోరేగా చిరపరిచితుడైన రామచంద్ర బాబాజీ మోరే 2003లో తన సామాజిక, రాజకీయ జీవిత అనుభవాన్ని స్వీయ చరిత్రగా అక్షరీకరిస్తూ మరణించడంతో ఆ అసంపూర్ణమైన జీవిత చరిత్రను అతని కుమారుడైన సత్యేంద్ర మోరే తండ్రి జీవిత చరిత్రగా రాసి కల సాకారం చేసాడు. దళిత్వా కమ్యూనిస్టు చల్వాలిచా షశక్తి దువా-కామ్రేడ్ మోరే అనేది ఈ మరాఠీ మూలరచన పేరు. అంటే దళితులకు, కమ్యూనిస్టులకు వారధి- కా. మోరే. ఈ రచనని అనుపమరావు సంపాదకీయంలో ఆంగ్లంలోకి వందనా సోనాల్కర్ అనువదిస్తే, అనంతరం తెలుగులోనికి తర్జుమా చేసే సాహసాన్ని యస్ వినయ కుమార్ చేసారు. దీన్ని ప్రచురించిన నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురణను అనేక విధాలుగా అభినందించాలి.

కా . రామచంద్ర బాబాజీ మోరే జీవిత కాలం 1903 నుండి నుండి 1972. అయితే కేవలం 1927 వరకూ తన జ్ఞాపకాలను స్వంత మాటల్లో రాసాడు, శేష జీవిత విశేషాలు కుమారుడు పూర్తి చేసాడు. తముందుగా సీనియర్ కా.మోరే జీవిత అనుభవాలు తన మాటల్లో రాసినవి మొదటి 91 పేజీల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వీటిని ముందు చూద్దాం. తన అనుభవాలను, అవగాహనను పంచుకునే ప్రయత్నంలో, పారదర్శకత విషయంలో ఎక్కడో చిన్న వెలితిగా అనిపిస్తుంది. అది అనువాద లోపమని అనుకోవలసి పని లేదు. అనార్య దేవుళ్లు ప్రాబల్యం అనంతర కాలంలో ఆర్య దేవుళ్ల ఆధిపత్యం, రెండు భారత దేశాలంటూ దేశంలో ఉన్న అసమానతలు, వివక్షలు ఎత్తి చూపే సాహసం ఒక కమ్యూనిస్టుగా చేయడం చర్చకు దారితీసే అంశం. ఎవరూ చూడ్డం లేదని కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లులతో పోలిక, పేదరికం అనుభవించ లేదు. కాబట్టి అంటరానితనం వేడి తగిలి ఉండకపోవచ్చననే ఆలోచనలు వ్యక్త పరుస్తాడు. తమ పూర్వీకులు స్వంత ఇంటికి పెంకులు, రాళ్ల వాడకం నిషేధించిన వైనం కులవాదుల చేతుల్లో అధికారం, వారికి బ్రిటీష్ సపోర్ట్ , ఉత్తరాన చిత్పవన్ బ్రాహ్మణ భూ ఆక్రమణలు గురించి రాస్తూ, 1914 నుండి ఆలీబాగ్‌లో తన హైస్కూల్ జీవితమంతా జీవితం నిండా అంబేద్కర్ ఆవహించి ఉన్నాడని చెపుతాడు. కానీ, అప్పటికీ డా. అంబేద్కర్ వయసు 22 సంవత్సరాలు, స్కాలర్షిప్ మీద పైచదువులకై ఆరాటపడుతున్న సమయం. మరి, కా. మోరే ను ఏ విధంగా అంబేద్కర్ ఉత్తేజ పరచగలిగాడో తెలియ చేయలేదు.

తర్వాత కాలంలో ఏర్పడిన పరిణామాలకు ఒక మన్నింపు సాకుగానూ, తను అనుభవిస్తున్న ఒక ఐడెంటిటీ క్రైసిసికు ఉపశమనం గానూ అనిపిస్త్తుంది. దళితుల సమస్యలను కమ్యూనిస్ట్టు పార్టీ తన ప్రధాన ఎజెండాలో చేర్చడం విఫలమైయ్యారనేది కా.మోరే ప్రధాన ఆక్షేపణ, ఆవేదన. ఒకప్పుడు పార్టీ నాయకులకు కేడర్‌కు మధ్య తేడా ఉండేది కాదని కానీ క్రమేణ పార్టీలో కులాధిపత్యాన్ని గమనించి దాన్ని తగ్గించేలా ప్రయత్నం ఒక ప్రక్క చేస్తూ మరొక ప్రక్క దళితులకు కమ్యూనిజం అవసరాన్ని ఉద్బోధిస్తూ ఒక వారధులా తన జీవితాన్ని అంకితం చేసాడనే విషయం మాత్రం తేటతెల్లం. 1938 ఫిబ్రవరిలో నాసిక్ జిల్లా మన్మడ్‌లో జి.యల్. పి రైల్వే అణగారిన కార్మికుల కాన్ఫెరెన్స్‌లో డా. అంబేద్కర్ కీలకోపన్యాసం చేసిన నాటి కరపత్రాన్ని 32వ పేజీలో ముద్రించడం కా. మోరే మీద అంబేద్కర్ ప్రభావాన్ని తెలుపుతుంది. దాన్ని అక్కడ ప్రచురించి ఉద్దేశం చాలా తీవ్రమైనది. ఆ కీలకోపన్యాసాన్ని ప్రచురించే సాహసాన్ని మాత్రం చేయలేకపోయాడు. నాటి అంబేద్కర్ ప్రసంగం కమ్యూనిస్ట్టు లతో సహా అన్ని రాజకీయ పార్టీలను కుదిపేయడమే కాక అంబేద్కర్‌ను ఒక బలమైన కార్మిక నాయకుడిగా నిలబెట్టింది.

మహరాష్ట్రలో మహర్‌గా పుట్టిన కా.మోరే కు జీవితంలో సంభవించిన అవమానాలు, వివక్షల పరంపరలు, కుటుంబ వలస వ్యథలు, ఆకలి చావులు ఆ సమయంలో నిమ్నజాతుల వారందరికీ అంటరానితనం నేపథ్యంలో జరిగేవే, అవే ఆయన నమోదు చేసారు. కొన్ని సందర్భాల్లో డా. అంబేద్కర్ కంటే కాస్త ముందుగానే తాను (1918 కల్లా) మహారాష్ట్రలో సామాజిక చైతన్యానికి పునాదులు వేసినట్లు ప్రకటిస్తారు. కమ్యూనిస్ట్టుగా జీవిస్తూనే తన జీవిత కాలం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరించే ప్రయత్నం చేసిన మోరే అభినందనీయడు. బాల్యంలో, యుక్త వయసులో తను పరిస్ధితుల దృష్ట్యా వ్యసనపరుడనని, హిందూ మత గ్రంధాల పారాయణం చేస్తూ భజన బృందాలతో అనేక చోట్ల చిన్న చిన్న మత కార్యక్రమాల్లోను, చిన్న చిన్న ఉద్యోగాలతో గడిపానని ఒప్పుకుంటారు. ఫూలే రచనలను చదివి ప్రేరేపితుడైనట్లు, బాలగంగాధరా తిలక్ ను అమితంగా అభిమానించి అతని అంతిమ యాత్రలో ఎంతో వ్యయ ప్రయాసలతో హాజరైన్నట్టు చెపుతాడు. మోరే పుట్టిన రాయగడ్ దగ్గర గ్రామం లడావాలికి మహద్‌కు గంట ప్రయాణం. మహద్‌లోని ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదవడం నివసించడంతో మహద్‌తో అనుబంధం ఉన్నట్టు ఆ నేపథ్యంతోనే మహద్ పోరాటానికి డా. అంబేద్కరును ఆహ్వానించడానికి నిర్ణయించినట్టు దీనికి కా. మోరే చాలా కీలక పాత్ర పోషించినట్లు రాసుకొచ్చారు. మహద్ పోరాటంలోనూ, మనుస్మృతి దహన సమయంలోనూ డా. అంబేద్కర్ వెన్నంటే ఉన్నారని రాసారు.

ఇక ద్వితీయార్ధంలో జీవిత చరిత్రను కొనసాగించిన సత్యేంద్ర మోరే మొదటి భాగంలోకి అనేక అంశాలను పునరుద్ఘాటిస్తూ మిగిలిన జీవిత అంశాలను ప్రస్తుతించారు. డా. అంబేద్కర్ చేసిన ప్రతీ సామాజిక ఉద్యమంలోనూ, బ్రిటీషు వ్యతిరేక ఉద్యమంలోనూ, కార్మికోద్యమంలోనూ, డిప్రెస్సడ్ క్లాసెస్ ఉద్యమంలోనూ, బొంబాయి మిల్లు కార్మిక ఉద్యమంలోనే, పత్రికల ప్రచురణ విషయంలోను తన తండ్రిది ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన పాత్రగా రాసారు. దళితుల సామాజిక సమస్యలే కాదు, దళితేతర వెనుకబడిన తరగతులవారి సమస్యలనూ ఉమ్మడి కార్యాచరంలోనికి తీసుకురావాల్సిన అవసరాన్ని కమ్యూనిస్ట్టులకు గుర్తు చేస్తారు కా. మోరే. ఈ ఉమ్మడి వర్గానికే డా. అంబేద్కర్ సామాజిక, విద్యాపరమైన వెనుకబడిన వర్గం (ఎస్‌ఇబిసి, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బేక్వర్డ్ క్లాస్) అని రాజ్యాంగపరమైన నామకరణం చేసారు. 1929లో కార్మిక సమ్మెలో కా.మోరే పాల్గొని కమ్యూనిస్ట్టుగా తన జీవితాన్ని ఆరంభించారు. అదే సమయంలో 1929 సెప్టంబరు ఆరంభమైన బహిష్కృత్ భారత్‌లో డా. అంబేద్కర్ మొదట ఉపరితలం, తర్వాత పునాది అనే సంపాదకీయ వ్యాసంలో సామాజిక అంశాలపై భారతీయ కమ్యూనిస్ట్టుల అవగాహనను ప్రశ్నిస్తూ రాసారు. కులం, అంటరానితనం విషయంలో భారతదేశ మూలాలకు కమ్యూనిజం వెళ్ల లేదని, కమ్యూనిస్ట్టుల లక్ష్యంలో అతివాదం ఉన్నా అది సరైనదికాదని మేము ఎప్పుడూ చెప్పలేదని రాసిన సంపాదకీయం మోరేను కామ్రేడ్ మోరేగా ప్రోత్సహించిందంటారు. సత్యేంద్ర మోరే (పేజి 156). కొంత కాలం విప్లవకారుని పాత్ర కూడా పోషించారు మోరే. అలా ఒక వైపు కమ్యూనిస్ట్ట్టులతో కమ్యూనిస్ట్టుగా, మరొక వైపు డా.అంబేద్కర్ చేస్తున్న పోరాటాల్లో దళిత ఉద్యమ నేతగా జమిలిగా ఉద్యమాలు నడిపిన ఘనత కా. మోరేది.

అదే ఏడాది కా. డాంగే, కా. రణదివే, కా. యస్.వి. దేశ్ పాండేలు కూడా కమ్యూనిజంలో మొదటి తరం భారత కమ్యూనిస్ట్టులుగా చేరిన చారిత్రక సమయమది. నీ నిజాయితీని అంకిత భావాన్ని చూసి పొంగిపోతున్నాను, నీలాంటి ఒక శిష్యుడు నాకున్నందుకుగర్విస్తున్నాను. నీవు పిరికి వాడవు కావు, ధైర్యశాలివి. నన్ను విడిచి నీవు మొత్తం మానవాళి విముక్తి మార్గాన్ని ఎంచుకున్నావు. బ్రాహ్మణులకు చెందిన భారత కమ్యూనిస్ట్టు పార్టీ నీ అంకిత భావాన్ని నిజాయితీని హర్షిస్తుందా? అన్న సందేహంలో ఉన్నాను అంటూ డా. అంబేద్కర్ అభినందించారని, అందుకు సమాధానంగా లక్ష్యం కోసం దళితులను ప్రత్యేక శక్తిగా రూపొందించడానికి అవసరమైన సామాజిక మద్దతు కమ్యూనిస్ట్టులకు లేదంటూ, ఆ దిశగా గాంధీ కూడా పోరాడలేదని ఆ శక్తి మీలో ఉన్నాయని, అందుకే ప్రజల దృష్టిలో నేను మిమ్మల్ని విడిచి వెళ్లినా దళితుల విముక్తి విషయం ఆచరణలో నేను మీ మనిషినే మిమ్మల్ని వదలని మోరే అన్నారని రాసుకొచ్చారు. ఆ విధంగా కా. మోరే మొదటి దళిత కమ్యూనిస్ట్ట్టు. దళిత కమ్యూనిస్ట్ట్టు అనే పదం ఇక్కడ ప్రధానం. మార్క్సిస్ట్ లెనినిస్టు సిద్దాంతంపై ఆధారపడిన కమ్యూనిస్ట్ట్టు పార్టీ, సామాజిక సవాళ్లు గురించి తెలిసినా ఆ సమస్యలపై పని చేయడానికి తగిన అంతర్గత నిర్మాణం దానికి లేదని, ఆ పనిని డా. అంబేద్కర్ చేసారని రాస్తూ, అలా సమాజంలో సమూలమైన మార్పు తీసుకొచ్చే కమ్యూనిష్టు ఉద్యమం జయప్రదం కావాలంటే ఇండిపెండెంట్ దళిత ఉద్యమాన్ని అర్ధం చేసుకోవాలనే భావనతో తన తండ్రి చాలా క్లారిటీతో ఉన్నారని అంతేకాదు, దళిత ఉద్యమాన్ని కమ్యూనిస్ట్ట్టు ఉద్యమంలో ఎలా భాగంగా మార్చాలో ఆలోచించే వారని, తాను రెండు ఉద్యమాల మధ్య వారధి కావాలని భావించారని సత్యేంద్ర రాసారు (పే. 162,3). అంబేద్కర్ బ్రిటీష్ వారి చేతిలో కీలు బొమ్మ అనే అవగాహన తప్పని (పే. 167) వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకున్న సామాజిక అవగాహన అంబేద్కర్ ది అంటూనే, తాను అనేక మంది బాబాసాహేబ్ అనుచరులకు కమ్యూనిస్ట్టు ఉద్యమాన్ని పరిచయం చేసి, చేర్చి కమ్యూనిస్ట్ట్టు ఉద్యమాన్ని పటిష్ట పరిచారని సమర్ధించుకున్నారు. తాను కమ్యూనిస్ట్టు పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నప్పటికీ డా. అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరపున తనకు రెండు సార్లు ఆహ్వానించినా తిరస్కరించిన నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ట్టు తన తండ్రి అని అభివర్ణించారు. అంబేద్కర్‌ను తప్పుగా అంచనా వేసినందుకు కా. డాంగేతో కూడా విభేదించారు మోరే. అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం వలన మార్క్‌ను అర్ధం చేసుకునేందుకు దళితులకు బౌద్ధం దోహదపడిందని రాహుల్ సాంకృత్యాయన్ మాటలను ఉదాహరించారు.

కమ్యూనిస్ట్ట్టులు, డా.అంబేద్కర్ ఒకరినొకరు విమర్శించుకున్న, వ్యతిరేకించుకున్న అనేక సందర్భాలను పుస్తకంలో చేర్చి పరామర్శించడంలో ఈ కా. మోరే జీవిత చరిత్ర సఫలమైందని చెప్పవచ్చు. అయితే అంబేద్కర్ ప్రతి సామాజిక, రాజకీయ పోరాటంలోతనూ భాగస్వామ్యినేననే చేసే క్లెయిమ్ మాత్రం పరిశీలించాల్సిన విషయం. ఇంతటి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిని డా. అంబేద్కర్ తన 17 వాల్యూమ్ ల రచనలు -ప్రసంగాలు (రైటింగ్స్ అండ్ స్పీచెస్) లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం. 17 వాల్యూమ్‌లలో ఒక మోరే ప్రస్తావన వస్తుంది అతడు ఇతడు కాదని ఆ సందర్భం చదివితే అర్థమౌతుంది. అలాగే డా.అంబేద్కర్‌తో చివర వరకూ ప్రయాణం చేసిన కా.మోరే జీవిత చరిత్రలో అంబేద్కర్‌కు అత్యంత సన్నిహితుడైన నానక్‌చంద్ రత్తూ ప్రస్తావన లేకపోవడం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది. కా. మోరే కమ్యూనిస్ట్ట్టు సెంట్రల్ కమిటీకు కుల పోరాటం అవసరాన్ని గుర్తు చేసినట్లు రాసిన లేఖలు కమ్యూనిస్ట్టు అగ్ర నాయకత్వాన్ని ఒక కుదుపు కుదిపినట్లు అర్థమవుతుంది. అయితే కా. మోరే యావత్ పోరాట చరిత్ర దళిత ఉద్యమాలకు మేలు చేసిందా? లేదా, అంబేద్కర్ భావజాలాన్ని బలపరిచిందా? బలహీన పరచిందా? కమ్యూనిస్ట్టు ఉద్యమానికి దోహదపడిందా? అనేది ప్రశ్నలకు భిన్న సమాధానాలు దొరుకుతాయి. డా. అంబేద్కర్ లక్ష్యం భారతీయ సమాజంలో దళితులను భాగస్వాములను చేయడమైతే, కా. మోరే జీవితం మొత్తం కమ్యూనిస్ట్టు పార్టీలో దళితులను జోడించడం. చివరకు తనను తాను దళితులకు కమ్యూనిస్ట్ట్టులకు వారధిగా చిత్రించుకుని లాల్- నీల్ పునాది వేసేప్రయత్నం చేసిన కమ్యూనిస్ట్ట్టుగా మిగిలాడా? దళితుడిగా మిగిలాడా? దళిక కమ్యూనిస్ట్టుగా మిగిలాడా? తెలీదు గానీ, దళిత కమ్యూనిస్ట్టుని అంటూ ఎప్పటి నుండో నలుగుతున్న కులం వర్సెస్ కమ్యూనిజం చర్చను కొత్త మలుపు తిప్పాడు. లాల్ నీల్ ఐక్యతకు కొత్త సవాళ్లను విసిరాడు. ఎన్నో కొత్త ప్రశ్నలను లేవనెత్తాడు. నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ట్టు పార్టీల్లో అంతర్భాగాలైన కుల వివక్ష పోరాట సమితిలు ( కెవిపిఎస్), దళిత హక్కుల పోరాట సమితిలు (డిహెచ్‌పిఎస్) లాంటి వాటి ఉనికిని వాటి ఎజెండాలను ప్రశ్నిస్తున్నాడు. కమ్యూనిస్ట్టు పార్టీల ప్రధాన ఎజెండాల గొడుగు క్రిందకు కులాన్ని, దళితుల సమస్యలను తీసుకు రావాల్సిన తరుణాన్ని అవసరాన్ని గుర్తు చేస్తున్నాడు. అదే జరిగితే లాల్ నీల్ కల సాకారం వైపు అడుగులు వేగం పడతాయనడంలో సందేహం లేదు. దళితేతర కమ్యూనిస్ట్ట్టులు, అంబేద్కర్‌ను అర్ధం చేసుకోవాలనుకునే కమ్యూనిస్ట్ట్టులు, కమ్యూనిజాన్ని ఆశ్రయించిన దళితులు ఖచ్చితం ఒక్కసారి చదవాల్సిన జీవిత చరిత్ర. అప్పుడే ఈ పుస్తకం తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్నట్లు, కా. మోరే వారధిగా తన లక్ష్యం సాకారం చేసుకున్నట్లు భావించవచ్చు.

– డా. మాటూరి శ్రీనివాస్, 9749000037.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News