మహిళా స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు గుజరాత్
ఐ-హబ్, తెలంగాణ వి-హబ్‌ల మధ్య భాగస్వామ్య ఒప్పందం
రెండు రాష్ట్రాలకు చెందిన 240 మంది మహిళా స్టార్టప్‌ల గుర్తింపు
ఇన్నోవేషన్ రంగంలో దేశానికి దిక్సూచి, ఆదర్శం తెలంగాణ- మంత్రి కెటిఆర్
వి-హబ్‌కు గుజరాత్ మంత్రులు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రారంభించిన వి-హబ్ ద్వారా అనేక మహిళా స్టార్టఫ్‌లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సైతం లభించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కేంద్రం మహిళ ఇన్నోవేషన్‌కు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు శనివారం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకు న్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టఫ్ట్లకు చేయూతనిచ్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వి-హబ్, గుజరాత్‌లోని ఐ-హబ్‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు రాష్ట్రాలకు చెందిన 240 స్టార్ట్ఫ్లను ఎంపిక చేసుకొని వాటికి అవసరమైన అన్ని రకాల చేయూత అందించడంతో పాటు, ముఖ్యంగా ఆయా స్టార్టప్‌లు మరింత మూలధనాన్ని (capital) అందుకునేలా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ అవగాహన కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు, గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమ, విభావరి బెన్ దవే (మహిళ, శిశు సంక్షేమ ప్రాథమిక విద్యా శాఖ మంత్రి)ల సమక్షంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన సీనియర్ అధికారులు జయేష్ రంజన్, అంజు శర్మలు ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
అనేక రాష్ట్రాలకు విహబ్ ఆదర్శం: కెటిఆర్
ఈ భాగస్వామ్యం ద్వారా సుమారు 240 మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎడ్యుటెక్, మెడిటెక్, ఫిన్ టెక్ వంటి రంగాల్లోని వారిని ఎంచుకొని, మూడు నెలల పాటు ఫ్రీ ఇంక్యుబేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో శిక్షణ అందించి, తుది దశలో 20 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేస్తారు. రెండు రాష్ట్రాలకు చెందిన 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు వి-హబ్, ఐ-హబ్ నేరుగా వారు ఎంచుకున్న రంగాల్లో అన్ని విధాల మద్ధతును అందిస్తాయి. ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించి జరిగిన వర్చువల్ కార్యక్రమం సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 నవంబర్ లో తాము మహిళా ఔత్సాహిక యువత కోసం ప్రత్యేకంగా ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌ను (వి-హబ్ ) పేరిట ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న విజన్, నిబద్ధత చాలా మందికి అర్థం కాలేదని, అయితే రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్ట్ఫ్లకు అందించిన చేయూత ద్వారా అనేక మంది మహిళలకు అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇన్నోవేషన్ రంగంలో, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి విహబ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈరోజు ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ద్వారా భవిష్యత్తులో మరింత గొప్ప ప్రగతిని ఈ రంగంలో సాధిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు రాష్ట్రాలకు చెందిన మహిళా స్టార్ట్ఫ్లకు తగిన గుర్తింపు లభిస్తుందని, అది మరింత ప్రగతి సాధించడానికి దోహదపడుతుందన్నారు. ఈరోజు జరిగిన ఒప్పందం నిజమైన ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో, కేవలం సామర్ధ్యమే ప్రామాణికంగా మహిళా ఇన్నోవేషన్ మరింత ముందుకు పోతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
విహబ్కు గుజరాత్ మంత్రుల అభినందనలు
దేశంలో ముందువరుసలో ఉన్న రెండు చురుకైన రాష్ట్రాలు తెలంగాణ, గుజరాత్‌లు ఈ అవగాహన ఒప్పందం ద్వారా మహిళా ఇన్నోవేషన్ ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు కలిసి పనిచేయడం చరిత్రలో నిలిచిపోతుందని, ఇరు రాష్ట్రాల అనుభవాలు, నాలెడ్జ్, దేశ ఇన్నోవేషన్ రంగానికి మరింత ఊతం ఇస్తాయని, ఈ అవగాహన ఒప్పందంలో భాగస్వాము లైనందుకు విహబ్కి గుజరాత్ మంత్రులు ఇరువురు అభినందనలు తెలియజేశారు.
రెండు కీలక రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం: జయేశ్‌రంజన్
ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం ద్వారా దేశంలోనే మొదటి సారి మహిళా ఇన్నోవేషన్ రంగంలో రెండు కీలక రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల్లోని మహిళలు నడిపే స్టార్టఫ్‌లకు ఫ్రీ ఇంక్యుబేషన్, ఇంక్యుబేషన్, పాలసీ స్టేక్ హోల్డర్స్ లతో అవసరమైన సంప్రదింపులకు సంబంధించి అన్ని విధాల మద్ధతు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వ్యక్తం చేశారు.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం: అంజుశర్మ
ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టఫ్లను బలోపేతం చేస్తూ దేశంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా కార్యాచరణ ఉండబోతుందని గుజరాత్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అంజుశర్మ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్నోవేషన్ అనుభవాలను, ఆదర్శ పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా వి-హబ్, ఐ-హబ్‌లకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
మూడు సంవత్సరాలుగా మూడున్నర వేలమందికి…సిఈవో దీప్తి రావుల
మూడు సంవత్సరాలుగా వి-హబ్ సుమారు మూడున్నర వేల మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పని చేసిందని, 11 స్టార్ట్ఫ్ ప్రోగ్రాంలను పూర్తి చేసిందని, 148 స్టార్టఫ్లను ఇంక్యూబెట్ చేయడంలో వి-హబ్ విజయం సాధించిందని వి-హబ్ సిఈవో దీప్తి రావుల పేర్కొ న్నారు. మూడు సంవత్సరాలుగా విహబ్ కు ఇన్నోవేషన్ రంగంలో సమకూరిన అనుభవాన్ని, నాలెడ్జ్‌ను గుజరాత్‌కు చెందిన ఐ-హబ్ కు అందిస్తామని, ఇలాంటి భాగస్వామ్యాల ద్వారా భారత దేశాన్ని మహిళా ఇన్నోవేషన్‌కు అంతర్జాతీయ రాజధానిగా మార్చేందుకు అవకాశాలు ఏర్పడతాయని దీప్తి రావుల ఆశాభావం వ్యక్తం చేశారు.
Memorandum of Understanding between I-Hub and V-Hub