Wednesday, January 22, 2025

హెచ్‌ఐవి మాత్రతో వృద్ధుల్లో తిరిగి జ్ఞాపక శక్తి

- Advertisement -
- Advertisement -

వృద్ధాప్యంలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వినికిడి శక్తి తక్కువ కావడం, జ్ఞాపకశక్తి నశించిపోతుండడం పరిపాటి. ఈ విధంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని డెమెన్షియా వ్యాధిగా వైద్యులు గుర్తిస్తుంటారు. ఐదు మిలియన్ల కన్నా ఎక్కువ మంది అమెరికన్లు ప్రస్తుతం డెమెన్షియా వ్యాధితో సతమతమవుతున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి.

ఈ డెమెన్షియాని పూర్తిగా నిర్మూలించ గల ఔషధం ఏదీ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ వ్యాధిని నెమ్మదింప జేయడానికి పరిమితంగా చికిత్సలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధుల్లో కోల్పోయిన జ్ఞాపకశక్తిని హెచ్‌ఐవి చికిత్సకు ఉపయోగించే మాత్ర తిరిగి రప్పించ గలుగుతుందని కాలిఫోర్నియా , లాస్‌ఏంజెల్స్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనుగొన్నారు.

ఈ మాత్ర విలువ తొమ్మిది డాలర్లు. సెల్జెంట్రీ అనే బ్రాండ్ పేరుపై మారవిరక్ అనే ఔషధం హెచ్‌ఐవి చికిత్సకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు డెమెన్షియా నిర్మూలనకు కూడా ఇది కీలక పాత్ర వహించగలదన్న ఆశాభావంతో పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మారవిరక్ జౌషధం నడివయసు లోని జంతువుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుకలపై మొదట ప్రయోగాలు చేయగా సత్ఫలితాలు కనిపించాయి.

సిసిఆర్ 5 అనే జన్యువు ఎలుకల్లో ఎక్కువగా ఉత్తేజితం అయినప్పుడు అవి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాయని, ఆ జన్యువును తొలగిస్తే అవి అన్నిటినీ చక్కగా గుర్తుంచుకోగలుగుతున్నాయని, మెదడు లోని కణాల అనుసంధానం కూడా బాగా ఉంటోందని పరిశోధకులు వివరించారు. మనుషుల్లో ఇదెంతవరకు జ్ఞాపకశక్తిని పటిష్టపరుస్తుందో , డెమెన్షియా ప్రారంభదశల్లో మనుషులు కోల్పోతున్న జ్ఞాపకశక్తిని తిరిగి ఎలా రప్పించగలుగుతుందో తెలుసుకోడానికి ఇప్పుడు మనుషులపై ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

హెచ్‌ఐవి వ్యాపింప చేయడానికి ఉపయోగపడే జన్యు కణాన్ని ఈ ఔషధం మార్చ గలుగుతుంది. కానీ అదే జన్యువు అవసరం లేని జ్ఞాపక కణాలను త్రుంచి పారేస్తుంది. ఫలితంగా జ్ఞాపక శక్తి పెంపొందడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మారవిరక్ ఔషధంతో ప్రయోగాలు చేయడానికి సిద్ధమౌతున్నట్టు పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ ఆల్వినో సిల్వా చెప్పారు. జ్ఞాపకశక్తి ఏ విధంగా నశిస్తుందో పూర్తిగా తెలుసుకుంటే ఆ ప్రక్రియను చాలా నెమ్మది చేసే మార్గం ఏర్పడుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News