Monday, December 23, 2024

గురుకుల ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి తగ్గించాలి

- Advertisement -
- Advertisement -
ఏకరూప పాలన అమలు చేయాలి
టిఎస్ యుటిఎఫ్ ధర్నాలో ఎంఎల్‌సి నర్సిరెడ్డి డిమాండ్

హైదరాబాద్ : ఉన్నత ప్రమాణాలతో అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి తగ్గించాలని, శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని, అన్ని గురుకులాల్లో ఏకరూప పాలన అమలు చేయాలని ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉపాధ్యాయుల మహాధర్నా కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన జరిగిన ధర్నా శిబిరంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సంతోషంగా పని చేయగలిగితేనే విద్యార్థులకు సంతృప్తికరంగా బోధించగలుగుతారని, బోధనతోపాటు పిల్లల యోగక్షేమాలు చూసే ఉపాధ్యాయుల సంక్షేమం బాధ్యత సంబంధిత సొసైటీలపై ఉందన్నారు. శ్రమకు తగిన విధంగా అదనపు వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, తాత్కాలిక ఉపాధ్యాయులకు బేసిక్ పే ఇవ్వాలని, బిసి గురుకుల పాఠశాలల సమయాలను ఇతర సొసైటీలతో సమానంగా మార్చాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి రంగారెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. కేర్ టేకర్ నియామకం వంటి ఆర్థిక భారం లేని సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయుల మన్ననలను పొందాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాస్తామన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ అన్ని గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, జిఓ 317 అమలుపై వివాదాలను, అభ్యంతరాలను సానుకూలంగా పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు డిజి నరసింహారావు, టిఎస్ యుటిఎఫ్ కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శి సింహాచలం, సీనియర్ నాయకులు పి మాణిక్ రెడ్డి గురుకులాల ప్రతినిధులు ఎస్ శ్రీజన, డి ఎల్లయ్య, జి రాంబాబు, వి హరీందర్ రెడ్డి, ఎన్ రాజశ్రీ , బి ప్రతిభ, లివిన్ స్టన్, మహేష్, దామోదర్, వేదాంత చారి, డా. సత్యం, టిఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు వై సైదులు, వి.అశోక్, గోపాల్ నాయక్, రమేష్ కుమార్, వలీ అహ్మద్, యాదగిరి, శ్యాంసుందర్ తదితరులు మాట్లాడారు. వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో గురుకుల ఉపాధ్యాయులు హాజరయ్యారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News