Tuesday, January 7, 2025

ఎవరి పాత్ర ఇది?

- Advertisement -
- Advertisement -

ఆకాశం కొద్ది కొద్దిగా చేతుల్లోకి వొదుగుతున్నప్పుడు
అది నిండు పౌర్ణమా?
లేక అమావాస్యా? ఏదీ పట్టదు
కన్నీరు దోసిలి నిండేప్పుడు తూనిక కొలతల్లో జీవితం అసలు తూగదు
పుస్తకం చదివాక ఎందుకు ఏడ్చానో నాకే గుర్తులేదు
అడవులు, కొండలూ, లోయలు, నదులు
అన్నిటినీ చూపించిన పుస్తకం
నక్షత్రాలనే కాదు అమావాస్యలనీ చూపించింది
అనేక పాత్రలు నా చుట్టూ తిరుగుతున్నప్పుడు
కళ్ళు నిశ్శబ్దంగా ఉండేవి
చూపులు చదువుతూ మూలిగేవి
ఓసారి నాకొక కలపడింది
నేను చదివేది ఒకటి
కానీ ఏడుస్తున్నది మరొకటి కలిపి
రెండు దుఃఖాలు కలిసిపోయిన క్షణాలు
అందరికీ ఎప్పుడో ఒకప్పుడు
తారసపడకుండా ఉండవు
పుస్తకం చదవడం నా వ్యక్తిగతమైనదే
ఏడుపూ వ్యక్తిగతమే

చదువరీ నేనే, పాత్రా నేనే
స్వప్నం రెక్కలు తొడిగి ఎగిరిపోయినప్పుడూ
నాకొక విషయం అర్ధమయింది
ఏడవడానికి శక్తిలేని వాళ్ళు చదవటానికి ఇష్టపడరు
దుఃఖాన్ని ఇష్టపడని వారు పుస్తకాన్ని ఇష్టపడరు
పుస్తక జీవితం నుండే కదా పుట్టేది
ఆ రాత్రి నేను చదువుతూనే ఉన్నాను
ఏడుస్తూనే ఉన్నాను
నేను చదివేది నను యేడిపించలేనిది
కానీ యేడిపిస్తోంది
ఎదురుగా కూర్చుని చెక్కుతూనే ఉంది
పుస్తకం ఖాళీ అవుతోంది నన్ను బరువెక్కిస్తుంది
రాత్రికి రెండు వైపులా తాడుకట్టి
లాగుతూనే ఉన్నారెవరో, నేను యేడ్చినట్టు
పుస్తకానికి ఏడవడం సాధ్యం కాదు
ఇంతకీ ఈ దుఃఖం ఎవరిది?

మెర్సీ మార్గరెట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News