ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాలని షర్మిలకు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం
నేడు ఢిల్లీకి పయనం…
రెండ్రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని షర్మిల వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల చేరనున్నారు. వై.ఎస్. షర్మిల తన పార్టీ వైఎస్‌ఆర్‌టిపిని ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌టిపి ముఖ్యనేతలతో వై.ఎస్ షర్మిల మంగళవారం సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టిపి నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం కట్టబెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అయితే తెలం గాణ ప్రభుత్వం త్వరలోనే నామినేటేడ్ పదవులను భర్తీ చేయనుంది. అయితే నామినేటేడ్ పదవుల్లో కూడ వై.ఎస్ షర్మిల అనుచరులకు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వై.ఎస్.షర్మిలకు సమాచారం పంపారు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాలని వై.ఎస్. షర్మిలకు మల్లికార్జున ఖర్గే నుండి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కర్ణాటక నుండి రాజ్యసభ పదవిని వై.ఎస్. షర్మిలకు ఇచ్చే ప్రతిపాదనను ఆ పార్టీ నాయకత్వం చేసిందని ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను మార్చాలని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 40 నుండి 60 స్థానాల్లో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను మార్చనున్నారు. వైఎస్సార్‌సిపి అసంతృప్తులు వై.ఎస్. షర్మిల వెంట నడిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వై.ఎస్. షర్మిల ప్రచారం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై షర్మిల కేంద్రీకరించనున్నారు.
‘కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం’
కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ఇది వరకే నిర్ణయించామని షర్మిల అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో తన తండ్రి , దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరిని తీసుకుని ఆమె అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నామని, అందుకే తెలంగాణలో ఆ పార్టీకి మద్ధతిచ్చానని చెప్పా రు. తమ మద్ధతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవడానికి తాము పోటీ పెట్టకపోవడమే కారణ మన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నానని, రెండ్రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని షర్మిల అన్నారు. తన కుమారుడికి వివాహం నిశ్చయమైన సందర్భంగా వైఎస్సార్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయ వచ్చినట్లు వెల్లడించారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన
వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై వైసిపి అగ్రనేత వైవి సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే వైపిపికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. అసలు, షర్మిల కాంగ్రెస్‌లో చేరతారో, లేదో అని వ్యాఖ్యానించారు. తాను జగన్ తరఫున షర్మిల వద్దకు రాయబారం వెళ్లినట్టు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక, వైసిపి ఎంఎల్‌ఎలు షర్మిల వైపు అడుగులేస్తున్నట్టు జరుగు తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. మంగళగిరి ఎంఎల్‌ఎ ఆర్కే షర్మిల వైపు వెళుతున్నాడని, మరికొందరు వ్యక్తిగత కారణా లతో పార్టీలు మారుతున్నారని వివరించారు. ఇక వైసిపిలో నియోజకవర్గ ఇంఛార్జీల మార్పు అంశంపైనా ఆయన స్పందించారు. పార్టీలో అందరికీ న్యాయం చేయలేమని అభిప్రాయపడ్డారు.