వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్టు మెటా ప్లాట్‌ఫామ్స్ బుధవారం ప్రకటించింది. 2020 ఆఖర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేక ఆయన మద్దతుదారులు 2021 జనవరి 6 న క్యాపిటల్ హిల్ పై దాడికి దిగారు. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్ చేసిన ప్రకటనలే ఈ దాడికి పురిగొల్పాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన నుంచి మరిన్ని సందేశాలు వెలువడితే పరిస్థితి మరింత దిగజారవచ్చన్న అనుమానంతో అప్పట్లో ట్రంప్ సామాజిక ఖాతాలను కంపెనీ నిషేధించింది.
ఇటీవలే ట్విటర్ సైతం ఆయన ఖాతాను పునరుద్ధరించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చు. అది మంచైనా, చెడైనా అంటూ బ్లాగ్ స్పాట్ వేదికగా వెల్లడించింది. ప్రజలు బ్యాలట్ బ్యాక్స్ ద్వారా తమ వాయిస్‌ను తెలపవచ్చని పేర్కొంది. అయితే ట్రంప్ చేసిన ఏ సందేశం అయినా ప్రజలకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని భావిస్తే దాన్ని ఆయన ఖాతాపై అలాగే కొనసాగిస్తామని , కానీ దాన్ని ఇతరులు షేర్ చేసేందుకు మాత్రం అనుమతించబోమని మెటా అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగ అధిపతి నిక్ క్లెగ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గళాన్ని వినిపించే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
వారు చెప్పే సమాచారంలో వాస్తవం లేకపోయినా మాట్లాడే అవకాశం ఉండాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ట్రంప్ ఖాతాను నిషేధించే నాటికి ఆయనకు ఫేస్‌బుక్‌లో 34 మిలియన్లు , ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచం లోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్. ఇది ట్రంప్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాలకు కావలసిన నిధులు సేకరణ లోనూ కీలక పాత్ర పోషించింది. తాజా మెటా నిర్ణయంపై ట్రంప్ స్పందించారు. “ మీ ప్రియమైన అధ్యక్షుణ్ణి నిషేధించడం ద్వారా బిలియన్ల డాలర్ల విలువను కోల్పోయిన ఫేస్‌బుక్ తాజాగా నా ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. ఒక సిట్టింగ్ అధ్యక్షుడిపై ఇలాంటి చర్యలకు మరోసారి దిగొద్దు. ఇంకెవరికీ ఇలా జరగొద్దు ” అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమైన “ట్రుత్ సోషల్” లో రాసుకొచ్చారు.