బెంగళూరు : శరవేగంతో జనులకు ఆహారం అందించే స్విగ్గీ ఇనుప ముక్కలో కాలేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఆహారప్రియుడు కోరికోరి తనకు షావార్మా వంటకం కోసం ఆర్డరు జారీ చేశాడు. తీరా ఈ మాంసాహార వంటకం తనకు అంది, తినేద్దామనుకుంటే ఈ ప్యాకెట్‌లో ఈ వంటకం మధ్య ఓ లోహపు ముక్క ఉండటం చూసి కంగుతిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని స్విగ్గీ నిర్వాహకులకు తెలిపాడు. అయితే వీరు దీనిని తేలిగ్గా కొట్టిపారేశారు. పైగా ఇనుప ముక్క వచ్చిందంటున్నారు కదా రూ 50 చెల్లిస్తాం, సరిపెట్టుకోండని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు ఈ వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వారంలోనే ఈ వ్యక్తి సామాజిక మాధ్యమంలో తన సమస్య తెలియచేసుకున్నాడు .
బిల్లు, తనకు అందినప్యాకెట్‌లో ఇమిడి ఉన్న ఇనుప ముక్క ఫోటోలు పొందుపర్చాడు. బెంగళూరులోని జెఎంజె హాస్పిటల్ దగ్గర్లో ఉన్న స్విగ్గీ నుంచి ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా దీనిని తెప్పించుకున్నట్లు కూడా తెలిపాడు. వంటకం తయారీకి వాడే చువ్వల ఇనుప ముక్క ఇందులో ఉన్నట్లు తినడానికి ముందు గుర్తించినట్లు ఈ వినియోగదారుడు తెలిపాడు. పైగా పంపిణీదార్ల పెడసరం మాటలు తనకు మరింత చిరాకు తెప్పించాయని, ఇక తన గోడు విన్పించుకోవడం తప్పితే తనకు సరైన న్యాయం ఎవరు జరిపిస్తారని ప్రశ్నించారు. అయితే న్యాయం కోసం ఎంతదూరం అయినా వెళ్లుతానని ప్రకటించారు.