మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు
ఈనెల 6, 7 తేదీల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లోలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పలు చోట్ల గరిష్టంగా 47 డిగ్రీల సెల్సియస్ నమోదు
పలు చోట్ల గరిష్టంగా 47 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రంలో వడగాల్పులు, తీవ్ర ఉక్కపోతతో జనం అతలాకుతలం అవుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా మే నెలలో మధ్యలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుతాయి. కానీ నెల ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ద్రోణి స్థిరంగా….
తెలంగాణలో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రెండు మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. పలు జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.