రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై
రాజ్ భవన్‌లో కెసిఆర్, మంత్రులు హాజరు
గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న సిఎం
మహేందర్‌రెడ్డికి భూగర్భగనుల శాఖ, సమాచార శాఖను కేటాయించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్ రెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించారు. గురువారం ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్‌తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గవర్నర్‌తో కలిసి తన మంత్రి మండలి సభ్యులందరితో గ్రూపు ఫోటో సెషన్‌లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డికి సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, చైర్మన్లు, తదితర ప్రజాప్రతినిధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. గత మార్చి నెలలో ఈటల రాజేందర్ బర్తరఫ్ చేయడంతో ఖాళీ అయిన మంత్రి స్థానం అలాగే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని ఇప్పుడు మహేందర్ రెడ్డితో భర్తీ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో మహేందర్ రెడ్డి పేరు లేదు. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రివర్గంలోకి ఆయన్ను తీసుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి. ఈ జిల్లాలో ఈయనకు మంచి పట్టుంది. ఈయన గతంలో మంత్రిగా పని చేశారు. తర్వాత జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించినా సిఎం కెసిఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిపై మహేందర్ రెడ్డి గతంలో అసహన వ్యాఖ్యలు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా లీకులు కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, అందులో మహేందర్ రెడ్డి పేరు లేకపోవడంతో ఇక ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డి స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే తర్వాత రోహిత్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. సిట్టింగ్‌లు అందిరికీ టిక్కెట్లు ఇవ్వాలనుకున్న కెసిఆర్ ఫిరాయింపు ఎంఎల్‌ఎలకూ అదే చాన్స్ ఇచ్చారు. దీతో మహేందర్ రెడ్డి పార్టీ మారిపోతారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ అనూహ్యంగా ఆయనకు కెసిఆర్ కేబినెట్‌లో చోటు దక్కింది. కాగా, మహేందర్‌రెడ్డికి భూగర్భగనుల శాఖ, సమాచార శాఖను సిఎం కెసిఆర్ కేటాయించారు.
శుభాకాంక్షలు…
నేడు రాజ్ భవన్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అంద జేసి రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్నం మహేందర్ రెడ్డికి అభినం దనలు తెలిపి, పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు.