Monday, December 23, 2024

వైభవంగా మెట్లోత్సవం

- Advertisement -
- Advertisement -

శ్రీ తాళ్లపాక అన్నమయ్య 520వ వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అన్న‌మాచార్య ప్రాజెక్ట్ సంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల‌.విభీషణ శర్మ మాట్లాడుతూ అన్న‌మ‌య్య త‌న సంకీర్త‌న‌ల‌తో భ‌క్తి ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి సామాజిక చైత్య‌న్యాన్ని తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. అన్న‌మ‌య్య త‌న భ‌క్తి సంకీర్త‌న‌ల‌తో సామాజిక‌, మాన‌సిక శాస్త్రావేత్త‌గా స‌మాజాన్ని నడిపించారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని వివ‌రించారు.

దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ మెట్లమార్గంలో నడచి వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనల గోష్టిగానం చేపట్టారు. భక్తులు సైతం పరవశించి గోష్టిగానంలో పాలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి, టీటీడీ అదనపు ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ రవి ప్రసాదు, సిఏఓ శ్రీ శేషశైలేంద్ర, ఎస్వీ మ్యూజియం ప్రత్యేక అధికారి శ్రీ కృష్ణారెడ్డి, అన్నమాచార్య వంశీయులు, ఇతర అధికారులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News