Friday, December 27, 2024

రెండు సాహిత్య ఉపకరణాలు

- Advertisement -
- Advertisement -

సాహిత్య ఉపకరణాల (literary devices) గురించిఆంగ్లసాహిత్యంలో చాలా ఎక్కువగానే చెప్పబడింది. దీనికి కారణం, అసలు ఆ ఉపకరణాల సంఖ్యే ఇంగ్లిష్ లో ఎక్కువగా ఉండటం.తెలుగు సాహిత్యంలోఅలంకారాలు, ఛందస్సు, భావచిత్రాలు, ప్రతీకలు, వ్యంగ్యం,శ్లేష, అన్యాపదేశం మొదలైనవి ఎన్నో ఉన్నమాట నిజమే ఐనా, ఆంగ్లంలో ఉన్నekphrasis, onomatopoeia,anaphora, enjambment లాంటి లెక్కలేనన్ని ఉపకరణాల గురించిన ప్రసక్తి మనసాహిత్యంలో లేదు. ఆంగ్లసాహిత్యంలో ఈ ఉపకరణాల సంఖ్య వందకు పైగానే ఉంది! అంత మాత్రాన ఈ అంశాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని, ఒక సాహిత్యం మరొక సాహిత్యంకన్న గొప్పదని వ్యాఖ్యానించడం మూర్ఖత్వమే అవుతుంది. పైగా ఇక్కడ చెప్పతగిన ఒక ముఖ్యవిషయమేమంటే, ఆంగ్లంలోని ఆ ఉపకరణాలు మనభాషలో ప్రత్యేక పేర్లతోచలామణిలో లేకపోయినా, ఆ పద్ధతులు వాడుకలో ఉన్నాయనే సంగతిని మరచిపోకూడదు.అంటే మనకు తెలియకుండానే ఆ సాహిత్య ఉపకరణాలను మనం వాడుతున్నాం అన్న మాట.ఆంగ్లంలో కూడా అవి poetic devices అనికాక literary devices అని పిలువబడుతున్నప్పటికీ వాటి వాడకం ఎక్కువ వరకు కవిత్వంలోనే ఉంది. ఆ ఉపకరణాలన్నిటికీ తెలుగులో పేర్లను నిర్ణయిస్తే, ఈ విషయంలో తెలుగు సాహిత్యం మరింత సుసంపన్నం కాగలదు.

ఆంగ్లసాహిత్యంలో చెప్పబడిన అన్ని సాహిత్య ఉపకరణాల గురించి రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది.కానీ ఇది కేవలం వ్యాసం. కనుక మెటానమీ (metonymy), సినిక్డికి (synecdoche) అనే రెండింటిని గురించి మాత్రమే ఇక్కడ చర్చించడం జరుగుతున్నది. ఇంతకు ముందు కొన్ని వ్యాసాలలో ఇవి ప్రస్తావనకు వచ్చాయేమో కానీ, వీటిని ఇలా విడిగా, వివరంగా చర్చిస్తే బాగుంటుందని అనిపించింది.దాని ఫలితమే ఈ వ్యాసం.

మెటానమీకి, సినిక్డికికి మధ్య ఉన్న సామ్యం దృష్ట్యా వాటిని జంటపదాలుగా అభివర్ణించవచ్చు. మెటానమీ అంటే ఒక అంశాన్ని మరొక అంశానికి సంపూర్ణంగా అపాదించి చెప్పడం. ఉదాహరణకు, అటు చూడు చుక్కల చీర వస్తోంది, అనే వాక్యంలో చుక్కల చీర ద్వారా ఒక స్త్రీని సూచించడం జరిగింది. అది కూడా ఆమె శరీర అవయవాల్లో దేన్నో ఒకదాన్ని కాకుండా మొత్తంగా ఆమెనే, అన్నది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే, మొత్తంగా కాకుండా ఒక శరీర భాగాన్ని మాత్రమే ఆపాదించినప్పుడు అది సినిక్డికి అవుతుంది.దీనికి వ్యతిరేకమైన విధానం- అంటే మొత్తం అంశానికి బదులు దానిలోని కొంత భాగాన్ని ప్రస్తావించడం- కూడా మెటానమీ కిందికే వస్తుంది ఆంగ్లంలో. మచ్చుకు,high society ని (సమాజంలో పరపపతి ఉన్న వ్యక్తులను)సూచించేందుకు societyఅనే మాటను ఉపయోగించడం అటువంటిదే. కానీ ఇటువంటి మెటానమీ ఉదాహరణలు ఇంగ్లిష్ లో తక్కువే.మెటానమీకి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.

1. ఆ పేరోలగంలోకి ఒక ఆరడుగుల కత్తి నడుచుకుంటూ వచ్చింది.
ఇక్కడ ఆరడుగుల కత్తి అంటే నిజంగా కత్తి కాదు, ఒక రాజు లేక వీరుడు. ఖరీదైన కోటుదర్పాన్ని ఒలకబోస్తూ వస్తోంది చూశావా, అన్నదికూడా ఈ రకానికే చెందిన వాక్యం.కోటు అంటే ఆ కోటును తొడుక్కున్న వ్యక్తి అని అర్థం చేసుకోవాలి.
2. ఒకపేరంటపు కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగిన కవితలో, ఒక అతిలోక సౌందర్యం ఒక పూలచెట్టును కౌగిలించుకుంది అని రాస్తే,అక్కడ కూడా అతిలోక సౌందర్యం, పూలచెట్టు ఇద్దరు స్త్రీలను సూచించే పదాలు.
3. తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంనేందుకు ఢిల్లీ దక్షిణభారతం వైపు చూస్తోంది. ఇక్కడ ఢిల్లీ అంటే ఢిల్లీలోని ప్రధాన రాజకీయ పార్టీ అని అర్థం.
4. ఆ సంస్థలోకి వచ్చిన కొత్తరక్తం సంస్థ ప్రతిష్ఠను పెంచుతుందని అంటున్నారు. ఇక్కడ కొత్తరక్తం అంటే కొత్త వ్యక్తులు, ముఖ్యంగా యువకులు అన్నది అసలు ఉద్దేశం.

ఇట్లా ఎన్నో వాక్యాలను మెటానమీకి ఉదాహరణలుగా చూపవచ్చు. మరికొన్ని ఉదాహరణలను ఇవ్వడం కోసంఇంగ్లిష్ లో వాడుకలో ఉన్నవాటిని మక్ఖీకీ మక్ఖీగా పేర్కొంటే పప్పులో కాలు వేసినవాళ్లమౌతాం. కారణం, అటువంటి ప్రయోగాలు తెలుగులో ఉండవు.I have all of my heart for you అంటే నువ్వంటే నాకెంతో ప్రేమ అని అర్థం. కానీ దీన్ని, నా మొత్తం హృదయాన్ని నీకోసం కలిగి ఉన్నాను అని రాయలేం. అనువాద రచనలోపదానికి పదం తర్జుమా చేస్తే తలెత్తే అవస్థల లాంటివే ఈ తిప్పలు. మళ్లీ సాహిత్య ఉపకరణాల విషయానికి వస్తే,పాత్రికేయులను సూచించేందుకుpressను, చక్రవర్తికి లేదా రాచరిక వ్యవస్థకు crownను,వంటకానికి dishను & ఇలా ఒకదానికి బదులు వేరొకదాన్ని కలిగి ఉంటాయి మెటానమీ వాక్యాలు. ముందు చెప్పినట్టు, సినిక్డికిలో ఒక వస్తువు లేక వ్యక్తిలోని ఒక భాగాన్ని మొత్తం వస్తువుకు లేదా వ్యక్తికి ఆపాదించడం జరుగుతుంది. దీని ఉదాహరణలు ఆంగ్లంలోనే ఎక్కువగా కనపడతాయి.ఈ కిందివాటిని పరిశీలించండి.

1. The captain commands one hundred sails.ఇక్కడ sails(తెరచాపలు) అంటే ఓడలు.
2. Let us go and see my friend’s new wheels. ఈ వాక్యంలో wheels (చక్రాలు) అంటే కారు ట్రక్కు లాంటి వాహనం.కానీ, నా మిత్రుని కొత్త చక్రాలను చూసొద్దాం రండి అనే ప్రయోగం తెలుగులో లేదు!
3. The shopkeeper is facinga problem due to a lack of hired hands. ఈ సందర్బంలో hired handsఅంటే పనివాళ్లు.తెలుగులో కూడా కింద చేతులు లేక ఇబ్బందవుతోంది అన్నది వ్యవహారంలో ఉందా?
4. There are many mouths in that family to be fed.ఈ వాక్యంలోmouthsఅంటే మనుషులు.దీన్నే తెలుగులో, ఆ కుటుంబంలో నింపాల్సిన కడుపులు చాలా ఉన్నాయి అని రాయవచ్చు బహుశా.
5. A grey beard approached me in the rail compartment for help. ఇక్కడ grey beard(నెరిసిన గడ్డం)అంటే వయసు మీరిన వ్యక్తి. తెలుగులో కూడా ఇటువంటి వాక్యం ఉంటుంది. ఉదాహరణకు, ఆ నెరిసిన గడ్డంతో నాకు మంచి స్నేహం ఉంది.
6. We need more boots for achieving victory in the ongoing war. ఈ వాక్యంలో boots అంటే సైనికులు అని అర్థం. పై వాక్యాలలో sails, wheels, hands, mouths, beard, boots…ఇవన్నీ వస్తువులోని భాగాలు లేదా వ్యక్తికి చెందిన అవయవాలు అని గమనించాలి. అలా కాకుండా మొత్తం వస్తువుకు లేదా వ్యక్తికి ఆపాదింపబడితే, అప్పుడవి సినిక్డికికి బదులు మెటానమీకి ఉదాహరణలు అవుతాయి. మనకు కొత్తవి ఐన భాషాసంప్రదాయాలను గమనించడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిలోని కొన్నింటిని మన సాహిత్యం లోకి దిగుమతి చేసుకోవచ్చు కూడా. కానీ ఆ పని చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించడం అవసరం.

ఎలనాగ
98669 45424

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News