హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఉమ్టా ప్రతిపాదనలు
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్‌లో మరింత అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలైన ట్రామ్ వే, రోప్‌వేలను ఏర్పాటు చేసే దిశగా మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ పరిధిలో పనిచేస్తున్న హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ పట్టణ ప్రజా రవాణా వ్యవస్థపై జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. విదేశాలను తలపించేలా వేగంగా ప్రయాణం, అతి తక్కువ భూసేకరణ, కాలుష్య రహితంగా ఉండే సరికొత్త ప్రజా రవాణా వ్యవస్థను నగరంలో అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు వేగంగా సాగుతోంది.
క్షేత్రస్థాయిలో అధ్యయనం
నార్త్-సౌత్ మొబిలిటీ కారిడార్, ఈస్ట్-వెస్ట్ కారిడార్ల పేరుతో పలు మార్గాల్లో కొత్త తరం ట్రామ్ వే, రోప్ వే మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులు నివేదికను రూపొందించారు. ఇప్పటికే ఉమ్టా బృందం అర్భన్ ట్రాన్స్‌పోర్టేషన్ నిపుణుల బృందంతో కలిసి దీనిపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రభుత్వం ఆమోదిస్తే నగర పరిధిలో మెట్రో రైలు తరహాలో సరికొత్తగా ట్రామ్ వే, రోప్ వేల రూపంలో నిర్ణీత మార్గాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కార్యరూపం దాల్చనుంది. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఇలాంటి ఆధునిక ప్రజా రవాణా సాధనాలను అందుబాటులోకి తెచ్చేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు ట్రామ్‌వే, రోప్‌వే వంటి ప్రాజెక్టులకు తక్కువ వ్యయంతో, భూసేకరణ సమస్యలు తక్కువగా ఉంటాయి.
ఎంజీబిఎస్ నుంచి జూ పార్కు వరకు సుమారు 5.5 కి.మీ
నార్త్-సౌత్ మొబిలిటీ కారిడార్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి చార్మినార్ వరకు 10.4 కి.మీ మేర న్యూ జనరేషన్ ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని సిఫారసు చేశారు. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో గ్రీన్‌లైన్ (నాగోల్- టు రాయదుర్గం టు కారిడార్-3)తో అనుసంధానం చేస్తారు. అదే విధంగా పాతబస్తీలో నిర్మించే మెట్రో మార్గంతో శాలిబండ వద్ద అనుసంధానం చేస్తారు. 2030 నాటికి ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజు మూడు లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎంజిబిఎస్ నుంచి జూ పార్కు వరకు సుమారు 5.5 కి.మీ మేర మూసీనది వెంబడి రోప్ వేను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ మార్గాన్ని ఎంజీబిఎస్ వద్దనున్న మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేస్తారు. అదే విధంగా ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో భాగంగా ఖైరతాబాద్ – సచివాలయం -అసెంబ్లీ -ప్యారడైజ్ మార్గంలో సుమారు 8.4 కి.మీ మేర ట్రామ్ వేను నిర్మించాలని ప్రతిపాదించారు.
రాయగిరి- టు యాదగిరి గుట్ట వరకు
భవిష్యత్‌లో నగరం నుంచి యాదాద్రికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్ -టు వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న రాయగిరి నుంచి యాదగిరిగుట్ట ఆలయం వరకు ఉన్న ప్రాంతాన్ని టూరిజం కారిడార్‌గా పరిగణించి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రాయగిరి వద్ద రైల్వే స్టేషన్ భవిష్యత్‌లో ఎంఎం టిఎస్ స్టేషన్‌గా మారి సబర్బన్ రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో అక్కడి దాకా రైళ్లలో వచ్చే ప్రయాణికులు యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లేందుకు రోప్ వేను 5.3 కి.మీ మేర నిర్మించాలని అధికారులు గుర్తించారు.
మెట్రో తరహాలో ట్రామ్‌వే, రోప్‌వే రవాణా వ్యవస్థ
నగరంలో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతుండంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెట్రో తరహాలో ట్రామ్‌వే, రోప్‌వే రవాణా వ్యవస్థను తీసుకొచ్చేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే పేరొందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది.