తుక్కుగూడ ఓఆర్‌ఆర్ వరకు మెట్రో విస్తరణ !
త్వరలో అధ్యయనం చేయనున్న మెట్రో అధికారులు
ఐటి రంగం విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు (31 కిలోమీటర్ల) మేర విస్తరించనున్న మెట్రో నిర్మాణంలో కొన్ని మార్పులు, చేర్పులు జరుగనున్నట్టుగా తెలిసింది. నాగోల్- టు రాయదుర్గం కారిడార్ 3కు కొనసాగింపుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతోనే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించి దానిని విమానాశ్రయంతో కనెక్టివిటీ చేయనుంది. మొత్తం రూ.6,250 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో మూడేళ్లలో పూర్తి చేయనుంది. గతేడాది డిసెంబర్ 9వ తేదీన సిఎం కెసిఆర్ ఈ మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం ఈ అలైన్‌మెంట్‌ను తుక్కుగూడ ఓఆర్‌ఆర్ దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. రానున్న రోజుల్లో ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడంతో పాటు భవిష్యత్‌లో ఐటీ రంగాన్ని మరింత వృద్ధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.
ఇంటర్‌ఛేంజ్ వరకు మెట్రో లైన్ నిర్మాణంపై….
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోలైన్‌కు పొడిగింపుగా శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా తుక్కుగూడ ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) ఇంటర్‌ఛేంజ్ వరకు మెట్రో లైన్ నిర్మాణంపై అధ్యయనం చేయాలని అధికారులు సైతం నిర్ణయించినట్టుగా తెలిసింది. హార్డ్‌వేర్ పార్క్, ఈ- సిటీ, రంగారెడ్డి కలెక్టరేట్, ఫార్మసీ, అమెజాన్ డేటా సెంటర్ వంటి సంస్థలు శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిభట్ల వంటి సౌత్ జోన్‌లో తమ కంపెనీలను విస్తరించాయి. దీంతో ఈ ప్రాంతాలు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుండటంతో నగరం నుంచి మెట్రో మార్గాన్ని కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలను తీర్చే ప్రాజెక్టుగా మెట్రో మారుతుందని, ఐటి రంగం మరింత విస్తరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.