Monday, January 20, 2025

హయత్‌నగర్‌కు మెట్రో

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల తర్వాత ఎల్‌బినగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను పొడిగిస్తామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం సుమారుగా రూ.55 కో ట్లతో చేపట్టిన నాగోల్ టు ఫీర్జాదిగూడ లింక్ రోడ్డుతో పాటు పలు ప్రారంభోత్సవ పనులను మంత్రి కె టిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగోల్- టు ఎల్‌బినగర్ వరకు 5 కి.మీల మేర మెట్రోలైన్‌ను రెండోఫేజ్‌లో అనుసంధానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్‌ను పూర్తి చేసి తీరతామని మంత్రి కెటిఆర్ హమీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే విజయమని, మూడోసారి సిఎంగా కెసిఆర్ అవుతారని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజా రవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తామని, టిమ్స్ ఆసుపత్రి గడ్డి అన్నారంలో రాబోతుందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమమే రెండు లక్ష్యాలుగా సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడి ఎద్దుల మాదిరిగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందచేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కెసిఆర్ కిట్ ఇలా ఎన్నో రకాల పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. జీఎస్‌డిపి తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, ప్రస్తుతం 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు.

ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం, క్రమశిక్షణ, వ్యూహాంతో ప్రజల అవసరాలు, రాష్ట్రం ఎక్కడ ఉంది, ఎక్కడికెళ్లాలన్న ఆలోచనతో పని చేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయన్నారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని ఇప్పటికే కేంద్రం ప్రకటించిందని మంత్రి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 కింద రాష్ట్రంలోని అత్యుత్తుమ మున్సిపాలిటీలకు 26 అవార్డులను కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని ఆయన తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతితో అటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లో సమాంతర అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని కెటిఆర్ పేర్కొన్నారు.

240 కోట్ల మొక్కలు నాటాం

హరితహారం కింత సిఎం కెసిఆర్ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు నాటామని ఆయన పేర్కొన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీ పంచాయతీల్లో గ్రీన్ బడ్జెట్ తీసుకువచ్చి హరితహారం ద్వారా 7.7శాతం గ్రీన్ కవర్ సాధించామని, 24శాతం ఉన్న గ్రీన్ కవర్ ఇవాళ 31.7శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా పచ్చదనం కనిపిస్తుందన్నారు. ఫతుల్లాగూడ మీదుగా ఫీర్జాదిగూడ వరకు వెళ్తుతున్న రోడ్డులో ఎక్కడికక్కడ రకరకాలు చెట్లు పెట్టామని, ఫతుల్లా గూడ ఏరియా ఒక్కప్పుడు అడుగుపెట్టరానివ్వకుండా, దుర్వాసన, అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్ కూడా అపురూపమైన పార్క్‌గా కెటిఆర్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని, చెట్లకు ఓట్లు ఉండవని, వాటితో ఎక్కువ లాభం ఉండదని ఆయన పేర్కొన్నారు.

నాలాల విస్తరణ కోసం మొదటిదశలో రూ.985 కోట్లు…

దేశంలో ఎక్కడా లేనివిధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను సంస్కారవంతంగా చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఎస్‌ఎన్‌డిపి పథకం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 పనులు చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందులో రెండు పూర్తయ్యాయని, డిసెంబర్ చివరి నాటికి 17 పనులు పూర్తి చేస్తామన్నారు. మరో 15 పనులు జనవరి వరకు పూర్తి చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్ సర్ఫేస్ నాలా, బుల్కాపూర్ నాలా పనులను ఎండాకాలం వరకు పూర్తి చేస్తామన్నారు. రూ.985 కోట్లతో పనులు చేపడుతున్నామని, ఎస్‌ఆర్‌డిపి కింద ఎల్‌బినగర్ చౌరస్తా రూపు రేఖలు ఎలా మారాయో ఎస్‌ఎన్‌డిపి కింద నగరం నలుమూలలా ఉండే నాలాల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో రూ.985 కోట్లతో మొదటి దశలో పనులు చేపట్టామన్నారు. ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులను త్వరలోనే చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.

మూసీ వద్ద రూ.52 కోట్లతో వంతెన

సుమారుగా 28 రాష్ట్రాల నుంచి ప్రజలు వలసలు వచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. నగరం విస్తరిస్తున్న పద్ధతుల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు పెరగపోతే మనం కూడా బెంగళూరులా మారిపోతామన్నారు. మూసీ వద్ద రూ.52 కోట్లతో వంతెన నిర్మించనున్నామని, దీంతోపాటు మూసీపై కొత్తగా 14 వంతెనలను నిర్మించనున్నట్లు కెటిఆర్ స్పష్టం చేశారు. ఆటోనగర్‌ను ఫ్లవర్ గార్డెన్స్ ఏర్పాటుకు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎల్‌బినగర్ నియోజకవర్గ పరిధిలో రూ.55కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.

ఎస్‌ఎన్‌డిపి ద్వారా బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు రూ. 7.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలాతో పాటు ఫతుల్లగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి వయా మహవీర్ హరణి వనస్థలి నేషనల్ పార్కు మీదుగా ఫీర్జాదీగూడ వరకు రూ. 26.50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫీర్జాదిగూడ లింక్‌రోడ్డు, జంతు సంరక్షణ కేంద్రంలో రూ. 84 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల స్మశానవాటికను, రూ. 16.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన హిందూ, క్రిస్టియన్ స్మశానవాటిక, ముస్లింల కబర్‌స్థాన్, వనస్థలిపురంలో స్విమ్మింగ్ పూల్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఎస్‌ఎన్‌డిపి ఎస్‌ఈ భాస్కరరెడ్డి , ఈఈ కృష్ణయ్య, జోనల్ ఎస్‌ఈ అశోక్ రెడ్డి, సిటీ ప్లానర్ ప్రసాదరావు, సర్కిల్ 3 కమిషనర్ మారుతి దివాకర్, ఈఈ రమేష్ బాబు, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News