మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టడానికి ఆమోదించడానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి రాసిన లేఖలో రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్భన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి వివరించారు.
చాలా వేగంగా పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ఇప్పటికే మొదటి దశ కింద నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు నగరానికి కలికితురాయిగా నిలిచిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్‌లో 69 కిలోమీటర్ల నిడివిలో అందుబాటులోకి వచ్చి నగర రవాణా వ్యవస్థకు అండగా నిలిచిందని కెటిఆర్ ఆ లేఖలో వివరించారు. విజిఎఫ్ స్కీం (వయబుల్ గ్యాప్ ఫండింగ్ ) పిపిపి పద్ధతిలో అమలు చేసిన హైదరాబాద్ రైల్ లైన్ ఫేజ్1 ప్రాజెక్ట్ ప్రపంచంలో పెద్ద మెట్రో ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిందని కెటిఆర్ తెలిపారు.
రూ.8,453 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు…
ఈ నేపథ్యంలో రెండో విడత 31 కిలోమీటర్ల నిడివిలో మెట్రోరైల్ ప్రాజెక్టు 2 కారిడార్ పనులకై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అందులో భాగంగా 1) బిహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలో మీటర్ల నిడివిలో 23 స్టేషన్లతో కనెక్ట్ చేసే ప్రతిపాదన. 2) నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల నిడివిలో 4 స్టేషన్లను కనెక్ట్ చేసే ప్రతిపాదనతో కూడిన డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను (డిపిఆర్‌ను) తయారు చేసినట్లు మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దీనిని చేపట్టడానికి రూ.8,453 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కెటిఆర్ లేఖలో వివరించారు.
ఈ డిపిఆర్తో పాటు అందుకు సంబంధించిన అన్ని డాకుమెంట్స్‌ను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ద్వారా అక్టోబర్ 22వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సెకండ్ ఫేజ్‌కు సంబందించిన ప్రతిపాదనల వివరాలు చర్చించడానికి కేంద్రమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వాలని మంత్రి కెటిఆర్ కోరారు. ముందస్తు సమాచారం కొరకు లేఖ ద్వారా వివరాలు తెలియ జేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన సూత్రప్రాయ అనుమతులు ఇవ్వాలని కెటిఆర్ కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు 2 కారిడార్ ప్రతిపాదనలను 2022, -23 బడ్జెట్ లో పేర్కొనాలని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో సూచించారు.