ఎంజీబిఎస్, చాంద్రాయణగుట్టల మధ్య మెట్రోరైల్ భూసేకరణ వేగవంతం
7.5 కిలోమీటర్ల నిడివిలో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణాల కోసం 1,200 ఆస్తులపై ఎఫెక్ట్
ఇప్పటికే 400 ఆస్తులకు భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశాం: మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎంజీబిఎస్, చాంద్రాయణగుట్టల మధ్య పాత నగరం మెట్రో రైల్ భూసేకరణ కార్యక్రమం వేగవంతం చేస్తున్నట్టు హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఎంఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబిఎస్, చాంద్రాయణగుట్టల మధ్య 7.5 కిలోమీటర్ల నిడివిలో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి 1,200 ఆస్తులపై ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు గాను ఇప్పటికే భూసేకరణ చట్టం 2013 క్రింద 400 ఆస్తులకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశామని ఎండి వెల్లడించారు. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ వార్తాపత్రికల్లో కూడా ఈ నోటిఫికేషన్లను ప్రచురించడం జరిగిందని ఆయన తెలిపారు. జిహెచ్ఎంసి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతుందని ఆయన చెప్పారు.
అయితే స్టేషన్ల వద్ద మాత్రం 120 అడుగుల వెడల్పులో విస్తరణ జరుగుతుందన్నారు. దారుల్ఫిషా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు ప్రస్తుతం రహదారి వెడల్పు 50 అడుగుల నుంచి 60 అడుగుల వరకు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణ గుట్ట జంక్షన్ వరకు 80 అడుగుల వెడల్పు ఉందని ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అందువల్ల దారుల్ఫిషా, -శాలిబండల మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి 20 నుంచి 25 అడుగుల చొప్పున విస్తరణ చేయాల్సి ఉంటుందని, అలాగే శాలిబండ నుంచి చాంద్రాయణ గుట్టల మధ్య ఒక్కో ఆస్తి 10 అడుగుల వరకు విస్తరణ చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
లైడార్ డ్రోన్ సర్వే చేపట్టాం
స్టేషన్లు, వంపు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందన్నారు. సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు 3డీలో వీక్షించే విధంగా లైడార్ డ్రోన్ సర్వే కూడా చేసినట్టు ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దీని వల్ల ప్రభావితం అయ్యే ఆస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులను కూడా వీక్షించవచ్చని ఆయన అన్నారు. ప్రభావిత నిర్మాణాల విలువను అంచనా వేసేందుకు హెచ్ఏఎంఎల్ ఇంజనీర్లు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ మెట్రో మార్గం వెంబడి ఉండే 103 మతపరమైన, సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ నిర్మాణాలను విలక్షణ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా సంరక్షించేలా, పిల్లర్లు, స్టేషన్ల వద్ద జాగ్రత్తగా సర్దుబాటు చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎండి తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులు హెచ్ఏఎంఎల్ భూ సేకరణ అధికారి కార్యాలయం వద్ద నిర్దిష్ట గడువులోగా తమ అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని, వివరాలు పొందవచ్చని ఆయన చెప్పారు. భూ సేకరణ చట్టం అనుసరించి చేపడుతున్న ఈ భూసేకరణ కార్యక్రమం ఎనిమిది నెలల్లో పూర్తి కావచ్చని ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.