శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు మెట్రో రైల్ ఎండి ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మెట్రో రైల్ నిర్మాణం అలైన్‌మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులు త్వరితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకమౌతుందన్నారు. ఈ సర్వే పనులను ఆదివారం నాడు ప్రాంభించిన ఎండి ఎన్వీయస్ రెడ్డి , హెచ్‌ఎయంఎల్ సీనియర్ ఇంజనీర్ల బృందంతో కలిసి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి నార్సింగి జంక్షన్ దాకా వున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ పొడవున వున్న ఈ మార్గంలో కాలినడకన నడుస్తూ ఇంజనీర్లకు, సర్వే బృందాలకు ఎండి తగిన ఆదేశాలు ఇచ్చారు వీటిలో మెట్రో స్టేషన్ ల నిర్మాణం ప్రధాన రహదారి జంక్షన్‌లకు దగ్గరగా ఉండాలని సూచించారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించిన విధంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ను నగర విస్తరణ ప్రణాళిక లో భాగంగా నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలని సూచించారు. ఈ కారిడార్ కేవలం విమానాశ్రయ ప్రయాణీకులకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో వుండే వారందరికీ, ముఖ్యంగా నగర శివార్లలో నివాసముండే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ కూడా వుపయోగపడేలా వుండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశమని ఎండి వివరించారు.
ఇక్కడ నుండి ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్ను డిజైన్ చేయాలని సూచించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం ఇప్పటికే ఆకాశహర్మ్యాలతో నిండి వుందని, భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి వూహించలేనంతగా పెరుగుతుందని అంటూ, భవిష్యత్తుని దృష్టిలో వుంచుకుని ఇక్కడ నిర్మించే మెట్రో స్టేషన్లు, అవసరమైన స్కై వాక్ ల నిర్మాణంకు సంబందించి సూచించాలని సర్వే బృందాన్ని ఎండి ఆదేశించారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో వున్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణీకుల వాహనాల పార్కింగ్ ఏరియా కోసం సూచించాలన్నారు. రాయదుర్గ్ స్టేషన్ నుండి సుమారు 900 మీటర్ల మేరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం రాయదుర్గ్ స్టేషన్‌ను పొడిగిస్తున్నప్పుడు, పొడిగించిన బ్లూ లైన్ కొత్త టెర్మినల్ స్టేషన్, ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్‌లను అనుసంధానంకు సంబంధించిన అవకాశాలను అన్వేషించమన్నారు.
ఈ ప్రదేశంలో స్థలాభావం వున్నందువల్ల ఐకియా భవనం తర్వాత ఎల్ అండ్ టీ- అరబిందో భవనాల ముందు ఈ రెండు కొత్త స్టేషన్‌లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించామన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ కొత్త రాయదుర్గ్ స్టేషన్, పొడిగించబడిన కొత్త బ్లూ లైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలని అన్నారు. మెట్రో కారిడార్ 2 (గ్రీన్ లైన్) లో నిర్మించిన జెబియస్ స్టేషన్, అలాగే అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ స్టేషన్‌ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం వుండబోతుందని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ మెట్రో మొదటి స్టేషన్‌కి ప్రవేశం, నిష్క్రమణలు ప్లాన్ చేసేముందు, ఇక్కడకు దగ్గర్లోనే ట్రాన్స్కో సంస్థ ఇటీవల వేసిన 400 కెవి అదనపు హై వోల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్ళను మార్చే అవసరం లేకుండా విధంగా ఉండాలని సూచించారు.
ఈ హై వోల్టేజ్ విద్యుత్ కేబుళ్లు మార్చడం చాలా సమయం తీసుకుంటుందన్నారు. అదే సమయంలో భారీ ఖర్చుతో కూడినది కాబట్టి అట్టి మార్పు అవసరం లేకుండా డిజైన్ చేయాలని ఇంజనీర్లను ఎండి ఆదేశించారు. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద వున్న ఫ్లైఓవర్ మీదుగా ఎయిర్‌పోర్ట్ మెట్రో వయాడక్ట్ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలని, ఇక్కడ కొత్తగా వేసిన అదనపు హై వోల్టేజ్ అండర్‌గ్రౌండ్ కేబుళ్ళను మార్చవలసిన అవసరం లేకుండా చేయాలన్నారు. అలాగే, మెట్రో మొదటి దశలో సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రే స్టేషన్‌ను ప్లాన్ చేసేటప్పుడు, ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో నిర్మించనున్న బిహెచ్‌ఇఎల్ – లక్డీ కా పుల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి సారించాలని ఎండి సూచించారు.
నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుండి వచ్చే ట్రాఫిక్ ని విశ్లేషించాలన్నారు. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్ ప్రయాణీకులకు వుపయోగకరంగా వుండాలని అన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించే అవకాశాన్ని పరిశీలించమన్నారు. నార్సింగి, కోకాపేట, మరి ఇతర సమీప ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఆవల నుండి వచ్చే ప్రయాణీకులను అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎన్‌విఎస్‌రెడ్డి తెలిపారు.