మహిళల భద్రత ప్రాధాన్యతతో రూపుదిద్దుకుంటున్న ’ట్యూటెమ్’ యాప్
మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రజల భద్రత విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు సాకారం చేసే దిశగా మెట్రో రైల్ అడుగులు ముందుకేస్తోందిని ఆయన తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్, హైదరాబాద్ పోలీస్ సహకారంతో బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్, ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా ఎడిబి ఆర్థిక సహాయంతో ట్యూటెమ్ (టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసారు. యాప్ రూపంలో ఇది త్వరలో హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది.
ఈ సందర్బంగా బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో గురువారం జరిగిన యూజర్ వర్క్ షాప్ లో మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యకు ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే పరిష్కారమని అన్నారు. మెట్రోలో ప్రయాణించే వారు ముఖ్యంగా మహిళలు తమ చిట్టచివరి గమ్యస్థానానికి భద్రంగా చేరడానికి ట్యూటెమ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. తమ ఇళ్ల నుంది గమ్యస్థానాల వరకు రాకపోకలు సాగించే ప్రక్రియలో ప్రయాణ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక సౌకర్యాలు ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో పొందుపరిచామని ఆయన తెలిపారు.
ఈ యాప్ లో డ్రైవర్ యాప్, యూజర్ యాప్ అని రెండు భాగాలు ఉంటాయని, దీనిలో ప్రయాణీకులను, ముఖ్యంగా మహిళా ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే అన్ని జాగ్రత్తలు పొందుపరచబడ్డాయని ఎన్‌విఎస్ రెడ్డి వివరించారు. ప్రయాణంలో సింహభాగం మెట్రో రైల్ ద్వారా జరిగితే మెట్రో రైల్ ప్రయాణానికి ముందు, తర్వాత ఇంటి వద్ద నుండి చివరి గమ్యస్థానం వరకు కాలినడకన, ద్విచక్ర వాహనంపై కాని కారు లేదా బస్సు లేదా ఆటో ద్వారా జరిగే ప్రయాణాన్ని కూడా కవర్ చేస్తూ ఈ యాప్ రూపొందించబడిందని ఆయన తెలిపారు. ఒక వేళ దారిలో ఎక్కడైనా మహిళా ప్రయాణీకులకు అభద్రతా భావం ఏర్పడితే వారు వెంటనే పోలీస్ కంట్రోల్ సెంటర్ ని, వారి ఇంటి వారిని, బంధువులను అప్రమత్తం చేసేలా సౌకర్యం ఉందని వెల్లడించారు.
సామాజిక ఆర్థిక సమస్యలకు ఇంజనీరింగ్, సాంకేతికతలు పరిష్కారం చూపాలన్నది తమ అభిమతమని, అందుకు తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలకు తాము ఎప్పుడు ముందుంటామని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. రోజూ దాదాపు అయిదు లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో గత ఏడేళ్లుగా నగరానికి పర్యావరణహితమైన ప్రయాణ సౌకర్యాలను అందిస్తోందని తెలిపారు. ప్రయాణీకులను ఆఫీస్‌లకు, విద్యాసంస్థలకు, తమ ఇళ్లకు సురక్షితంగా చేర్చేలా ఇప్పటికే వివిధ సంస్థలతో సంయుక్తంగా పలు సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు ‘ట్యూటెమ్’ మరింత కొత్త అనుభవాన్ని అందించడానికి త్వరలో అందుబాటులోకి రాబోతోందని మెట్రో ఎండి వెల్లడించారు.
బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామ్ గోపాల్ రావు మాట్లాడుతూ అర్థరాత్రి సమయాల్లో కూడా మహిళలు సురక్షితంగా తమ గమ్యాలకు చేరడానికి ఈ ‘ట్యూటెమ్’ యాప్ లో పలు సౌకర్యాలు పొందుపరిచామని అన్నారు. ఇది రాబోయే రోజుల్లో హైదరాబాద్ తో పాటు దేశంలో ఇతర నగరాలకు కూడా విస్తరించేలా తమ సంస్థ సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని అన్నారు. ఎడిబి ప్రతినిథి కుమారి జోసెఫిన్ ఎక్వినో, బిట్స్ పిలాని క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సౌమ్యో ముఖర్జీ, ఐఐటి బొంబాయి కి చెందిన ప్రొఫెసర్ అవిజిత్ మాజీ, బిట్స్ పిలాని ప్రొఫెసర్ ప్రశాంత్ సాహు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.