Wednesday, January 22, 2025

భక్తులతో కిక్కిరిసి పోతున్న మెట్రో రైళ్లు

- Advertisement -
- Advertisement -

Metro trains are crowded with Ganesh devotees

జనం సంద్రంగా మారిన ఖైరతాబాద్ స్టేషన్
గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్త జనం
రూట్ గైడ్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించిన మెట్రో
ప్రస్తుతం 4 లక్షల దాటిన మెట్రో ప్రయాణికుల సంఖ్య

మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో వినాయకచవితి ప్రారంభం నుంచి ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. గణేష్ ఉత్సవాలు మొదలైన నాటి నుంచి నగరంలో పేరుగాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా భక్తులు తరలివస్తున్నారు. వాహనాలకు పార్కింగ్ స్దలం కొరత ఉందని వచ్చే భక్తులంతా మెట్రోలో రావాలని అధికారులు సూచించడంతో మెట్రో అందుబాటులో ఉండే ఎల్బీనగర్ నుంచి మియాపూర్, మాదాపూర్, ఉప్పల్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్త జనం కదిలివస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వినాయక మండపానికి వెళ్లే భక్తులు అయోమయానికి గురికాకుండా ఉండేందుకు రెండు వైపు నుంచి నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేసి దారులు చూపిస్తున్నారు. టికెట్ల కౌంటర్లు పెంచి ఆలస్యం కాకుండా చర్యలు చేపడుతున్నారు. మెట్రోలో భక్తుల రావడంతో ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గిందని, అందరు సొంత వాహనాల్లో వస్తే రోడ్లు రద్దీగా మారేవని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు.

గణేష్ ఉత్సవాలకు ముందు మెట్రో ప్రయాణీకుల సంఖ్య 3. 80లక్షలుండగా నాలుగు రోజుల నుంచి 4. 20 లక్షలు దాటినట్లు మెట్రో ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా పలు మెట్రో స్టేషన్లు ద్విచక్ర వాహనాలతో నిండిపోతున్నాయని వీటి ద్వారా మరింత ఆదాయం వస్తున్నట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రైల్ వేగం పెంపు చేయడంతో ఐదు నిమిషాలు ముందుగా చేరుకుంటున్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. దీనికి తోడు వైరస్ వ్యాప్తిచెందకుండా ఎప్పటికప్పుడు శానిటైజర్, మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు.

ప్రయాణీకులు ఎక్కువగా ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం కారిడార్లలో గతం కంటే 15 శాతం పెరిగినట్లు, ఎంజిబిఎస్, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట,జూబ్లీహిల్స్,మాదాపూర్ స్టేషన్లు జన సందోహంగా మారాయి. రెండు నెల నుంచి చమరు ధరల పెంపు, వర్షాలతో సొంత వాహనాలు వదిలి ఉద్యోగులంతా మెట్రోలో గమ్యస్దానాలకు చేరుకుంటున్నారు. దీంతో మెట్రో లాబాల బాటలో పడింది. నగర ప్రజలు ఇదే తరహాలో మెట్రోను ఆదరిస్తే రెండేళ్లలో ముంబాయి మెట్రోను తలపిస్తుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాదరణ చూస్తుంటే మున్ముందు మెట్రోకు మంచి రోజులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News