మనతెలంగాణ/హైదరాబాద్ : న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నగర వాసులకు మెట్రో రైళ్లు తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సురక్షితమైన ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు రైళ్లను నడపాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. చివరి రైళ్లు ప్రారంభమైన స్టేషన్ల నుంచి 31వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంటకు బయలుదేరి జనవరి 1వ తేదీన తెల్లవారుజామున 2 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని అధికారులు ప్రకటించారు. రైళ్లు, స్టేషన్లలో మద్యం తాగి దుర్భాషలాడకుండా మెట్రో రైల్ పోలీసులు, సెక్యూరిటీ వింగ్‌ల నిఘా ఉంచుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా మెట్రో రైళ్లలో అధికారులు సహకరించాలని, బాధ్యతాయుతంగా ప్రయాణించాలని మెట్రో రైలు అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలకు ముందు, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డులపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్‌లోని శిల్పా లే ఔట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ 1, 2, షేక్‌పేట్, మైండ్ స్పేస్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45, సైబర్ టవర్స్, ఫోరమ్ మాల్- జెఎనీయూయు, కైతలాపూర్, బాలానగర్, ఫ్లైఓవర్లు రాత్రి 11 గంటల ఉదయం 5గంటల వరకు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మైట్రోరైళ్లను ప్రయాణికులు ఆశ్రయించనున్నారు.