ఆఫీసులకు వెళ్లే సమయంతో సేవలకు అంతరాయం
అరగంట పాటు రైల్‌లో ఇబ్బందులు పడుతున్న జనం
మూడు నెలలో ఐదు సార్లు పట్టాలపై ఇదే సమస్య
సిబ్బంది తీరుపై మండిపడుతున్న ప్రయాణికులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరానికి మణిహారం నిలిచిన మెట్రో రైల్ సాంకేతిక లోపంతో పట్టాలపై నిలిచిపోతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. మూడు నెలల వ్యవధిలో ఐదుసార్లు నిలిచిపోయి ప్రయాణికుల నుంచి మెట్రో ఉన్నతాధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం కూడా సాంకేతిక లోపం నిలిచిపోవడంతో నగర వాసులు మెట్రో తీరుపై మండిపడుతున్నారు. త్వరగా గమ్యస్దానాలకు చేరుకుంటామని భావిస్తే కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ విధంగా జరగడంతో ఆలస్యంగా విధులకు చేరుకోవాల్సి వస్తుంది పేర్కొంటున్నారు.
రెండుపర్యాయాలు ఎల్బీనగర్, మియాపూర్ రెడ్ కారిడార్ పరిధిలోని అసెంబ్లీ స్టేషన్ వద్ద ఆరగంట పాటు రైళ్లు నిలిచిపోయాయి. ఆగస్టులో మూసరాంబాగ్ స్టేషన్‌లో మధ్యాహ్నం వేళ 20 నిమిషాల పాటు మెట్రో ఆగిపోయింది. వెంటనే సిబ్బంది మరమ్మత్తులు చేసి పట్టాలెక్కించారు. మంగళవారం మరోసారి మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో నిలిచిపోవడంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో కారిడార్‌లో ఆరగంట పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మిగతా కారిడార్ల పరిధిలో కూడా రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు సిబ్బంది పేర్కొన్నారు.
టికెట్లు తీసుకున్న వారంతా స్టేషనల్లో గంట పాటు నిరీక్షించారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో జరిగిన అనుభవనాలను దృష్టిలో పెట్టుకుని రైళ్లు నిలిచిపోతున్న ఎందుకు నిర్లక్షం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా గమ్యస్దానాలకు చేరుతామని ప్రయానిస్తే గంటల తరబడి సాంకేతిక కారణాలతో స్టేషన్లలో ఉండాల్సి వస్తుందంటున్నారు. ఇదే విధంగా మెట్రో సేవలుంటే భవిష్యత్తులో నగరవాసులు మెట్రోలో వెళ్లడం కష్టమని పేర్కొంటున్నారు. ఇప్పటికేనా మెట్రో ఉన్నతాధికారులు మెట్రో రైళ్లు సకాలంలో నడిచే విధంగా చర్యలు తీసుకుని, సాంకేతిక లోపాలు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.