పాలక్కాడ్: మెట్రోమ్యాన్ శ్రీధరన్‌పై వామపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓటర్లు శ్రీధరన్ పాదాలకు నమస్కరించడం, కడగడం వంటి దృశ్యాలతో కూడిన చిత్రాలు వివాదాస్పదం అయ్యాయి. ఎప్రిల్ 6వ తేదీనాటి కేరళ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీధరన్ పాలక్కాడ్ నుంచి బిజెపి అభ్యర్థిగా ఉన్నారు. ప్రచార సమయంలో శ్రీధరన్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై వామపక్షాలు మండిపడ్డాయి. ఈ టెక్నోక్రాట్ పద్థతి సరికాదని, పైగా బిజెపి దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నదనేది ఈ ఫోటోలతో తేటతెల్లం అవుతుందని సిపిఐ నేత , రాజ్యసభ ఎంపి బినయ్ విశ్వమ్ విమర్శించారు. ఓ ఫోటోలో ఓ వ్యక్తి శ్రీధరన్ ముందు మోకరిల్లడం, మరో ఫోటోలో ఓ మహిళ ఆయన కాళ్లపై పడటం వంటి ఘట్టాలు ఉన్నాయి. అయితే ఓటర్ల చేష్టలను శ్రీధరన్ సమర్థించారు. సాంప్రదాయక భారతీయ పద్థతి అంటే ఇదే అని, మహిళలు ఇతరులు పెద్ద వారి పట్ల ఈ విధంగా తమ గౌరవాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. ఈ వాదనను ఎంపి విశ్వం తీవ్రంగా తోసిపుచ్చారు. పాదాలు కడిగించుకుని, పైగా దీనిని గొప్పగా చిత్రీకరించుకుంటున్నాడని విమర్శించారు.