గ్రహాంతర జీవుల విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీనే. గుర్తు తెలియని గుండ్రటి వస్తువులేవో ఆకాశంలో ఎగురుతున్నట్టుగా చెబుతూ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. అలా వచ్చిన ప్రతిసారీ దానిపై చర్చ జరుగుతుంటుంది. 2014లో హఠాత్తుగా కనిపించకుండా పోయిన ఎం హెక్ 370 విమానానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరలైంది. దాంటో ఒక గుండ్రటి వస్తువు విమానం చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు కనిపించింది. అయితే అది నిజమైన వీడియో కాదని , ఎడిట్ చేశారని సైబర్ నిపుణలు చెబుతున్నారు. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఓ యూజర్ స్పేస్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అభిప్రాయాన్ని కోరారు. దీనిపై మస్క్ స్పందిస్తూ “ నేను ఇప్పటివరు ఏలియెన్స్కు సంబంధించిన ఆధారాలను చూడలేదు.
ఒకవేళ నా దృష్టికి వస్తే వెంటనే ఆ వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తాను. స్పేస్ఎక్స్కు చెందిన దాదాపు 6000 ఉపగ్రహాలు కక్షలో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి ఇప్పటివరకు ఏలియెన్స్ను ఎదుర్కొన్న సందర్భాలు లేవు ” అన్నారు. 2014లో ఎంహెచ్ 370 కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరింది. 227 మంది ప్రయాణికులతోపాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన 38 నిమిషాల తరువాత ఆ విమానం కనిపించకుండా పోయింది. తర్వాత ఓ గంట పాటు మిలిటరీ రాడార్లలో దాని ఆనవాళ్లు కనిపించాయి. నిర్దేశిత మార్గంలో కాకుండా మాలే ద్వీపం అండమాన్ సముద్రాన్ని దాటేసి వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత దాని జాడ ఇప్పటివరకు కనిపించలేదు. ఆధునిక విమానయాన చరిత్రలో ఇదోపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి ఏలియెన్స్ థియరీ.