Wednesday, January 22, 2025

కమిన్స్ ఇన్నింగ్స్ అదరహో..

- Advertisement -
- Advertisement -

పుణె: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ పాట్ కమిన్స్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కమిన్స్ రికార్డు బ్యాటింగ్‌ను కనబరచడంతో కోల్‌కతా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు దిగిన కమిన్స్ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఐపిఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ల సరసన నిలిచాడు. ముంబై మ్యాచ్‌లో కమిన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు.

వరుస ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లను హడలెత్తించాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ఇది చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం. అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన కమిన్స్ 15 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, 4 బౌండరీలతో 56 పరుగులు చేశాడు. అతని విధ్వంసక ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సయితం కమిన్స్ బ్యాటింగ్ తీరును కొనియాడాడు. రానున్న మ్యాచుల్లో కమిన్స్ ఇలాగే విధ్వంసం సృష్టిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయమనే చెప్పాలి.

MI vs KKR: Pat Cummins Register Fastest Fifty in IPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News