Monday, January 20, 2025

ముంబైకి సవాల్

- Advertisement -
- Advertisement -

నేడు లక్నోతో పోరు
లక్నో: వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇక లక్నో 9 మ్యాచుల్లో ఐదు గెలిచి కాస్త మెరుగైన స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ముంబై పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య పూర్తిగా విఫలమవుతున్నాడు.

అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబై పోరాడి ఓడింది. 258 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై చివరి వరకు విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్య ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేక పోయారు. ఇలాంటి స్థితిలో లక్నోతో జరిగే మ్యాచ్ కూడా ముంబైకి పరీక్షగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ముంబై సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాల్సి ఉంది.

ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు భారీ ఇన్నింగ్స్‌లు ఆడక తప్పదు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సి ఉంటుంది. నెహాల్ వధెరా, టిమ్ డేవిడ్, తిలక్ వర్మలు కూడా బ్యాట్‌ను ఝులిపించాలి. బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాలి. అప్పుడే ఈ మ్యాచ్‌లో ముంబైకి గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇక లక్నో వరుస విజయాలతో జోరుమీదుంది.

ఈ సీజన్‌లో లక్నో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలోపేతంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రాహుల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా లక్నోకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News